Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పొగాకుతో తయారయ్యే గుట్కా వంటి నమిలి తినే ఉత్పత్తులను నిషేధిస్తూ రాష్ట్ర సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు సమర్ధించింది. గుట్కా ఇతర పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను నిషేధిస్తూ రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఈ ఏడాది జనవరిలో వెలువరించిన నోటిఫికేషన్‌ను 125కుపైగా కంపెనీలు సవాల్ చేసిన రిట్లను కొట్టేస్తూ చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం తీర్పు వెలువరించింది. ''పూర్తిగా లేదా పాక్షికంగా శుభ్రం చేసి తయారయ్యే పొగాకు ఉత్పత్తులను రాష్ట్ర ఆహార భద్రత చట్టం-2006 నిబంధనలకు అనుగుణంగా నిషేధించే అధికారం రాష్ట్రానికి ఉంది. పొగాకు వల్ల ఎంతోమంది క్యాన్సర్‌తో బాధపడి చనిపోతున్నారు. ఇది ప్రజారోగ్యంతో ముడిపడిన వ్యవహారం. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం నిషేధించడం చట్టబద్ధమే. ఇలాంటి వాటిని నిషేధించాలని ఏనాడో సుప్రీంకోర్టు చెప్పింది.
ప్రజలు జీవించే హక్కును కాలరాసే విధంగా ఉన్న వాటిని నిషేధించవచ్చు. ఇక్కడ చూడాల్సింది వాటి అమ్మకాలు, వాటిపై ఆధారపడిన వారి జీవితాలు కాదు. ప్రజల ఆరోగ్యం. ప్రజారోగ్య కోణంలోనే ప్రభుత్వం నిషేధించింది. అమ్మకాలపై నిషేధ ఉత్తర్వులకు చట్టబద్ధత ఉంది. రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన ఏమీ జరగలేదు. పొగాకుతో చేసే సిగరెట్ల అమ్మకాలను నిషేధించలేదు కాబట్టి నమిలి తినే వాటిని అనుమతించాలని కోరడం సరికాదు. ప్రజారోగ్యం కోణంలో వాటిని నిషేధించే అధికారం రాష్ట్రానికి ఉంది'' అని తీర్పు చెప్పింది. గుట్కా వల్ల ఎంతోమంది క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారనీ, ఇది కోవిడ్ కంటే తీవ్రమైన మహమ్మారి అని కామెంట్ చేస్తూ, రిట్లను డిస్మిస్ చేసింది.