Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు బీట్ ఆఫీసర్లకు గాయాలు
- ఒకరి పరిస్థితి విషమం.. 2 ట్రాక్టర్ల స్వాధీనం
నవతెలంగాణ-లింగంపేట్
అటవీ ప్రాంతాన్ని చదును చేస్తుండగా.. అడ్డుకునేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులపై దాడులు చేశారు. దాంతో అధికారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం ముంబోజిపేట్ తండాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. అటవీ శాఖ అధికారుల వివరాల ప్రకారం.. ముంబోజిపేట్ తండాకు చెందిన ముంబోజిపేట్ గ్రామానికి చెందిన వడ్డే హనుమంతు, ముంబోజిపేట్ తండాకు చెందిన గణేష్‌తో పాటు మరో నలుగురు కలిసి నాలుగు ట్రాక్టర్లతో సోమవారం రాత్రి పది గంటల ప్రాంతంలో కంప్లైంట్ నెంబర్ 801 వెళ్లుట్ల సెక్షన్ పరిధిలోని మంబోజిపేట్-కొండాపూర్ తండా సమీపంలో అటవీశాఖ ఆధీనంలో ఉన్నటు వంటి అటవీ భూమిలో గుట్టుచప్పుడు కాకుండా చదును చేస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ బీట్ అధికారులు ఫిరోజ్, మహేష్ అక్కడికి చేరుకొని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దాంతో గణేష్, హనుమంత్‌తో పాటు మరో ఇద్దరు అధికారులపై దాడికి దిగారు. బీట్ ఆఫీసర్ ఫిరోజ్‌కు తీవ్ర గాయాలవడంతో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మహేశ్ తప్పించుకోవడంతో స్వల్పగాయాలతో బయటపడ్డాడు. అటవీ అధికారుల నుంచి తప్పించుకునే క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడింది. సమాచారం అందుకున్న సబ్ డీఎఫ్ శ్రీనివాస్, ఎల్లారెడ్డి రేంజ్ అధికారి ఓంకార్, కామారెడ్డి రేంజ్ అధికారి విద్యాసాగర్, అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని లింగంపేట్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.