Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'మెప్మా' స్కాంపై మొదలైన విచారణ
- గతంలో మాదిరిగానే సాగనున్న
విచారణ ప్రక్రియ
- ప్రత్యేక దృష్టిసారించిన అడిషనల్ కలెక్టర్
- 60 డివిజన్లలో 4685 సంఘాల నమోదు
- అందులో బినామీగా అనుమానం ఉన్నవి 300సంఘాలపైనే..
- తెలంగాణ గ్రామీణ బ్యాంకులోనే అత్యధిక డిఫాల్టర్లు?
- ఇచ్చిన నోటీసులు తిరిగి బ్యాంకుకే రావడంతో విషయం వెలుగులోకి..
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
మహిళా సంఘాల్లో.. బోగస్ ఉదంతం బట్టబయలైంది. 60 డివిజన్లు..43,543 మంది సభ్యులతో ఉన్న 6485 మహిళా సంఘాల్లో సుమారు 300 వరకు బోగస్‌గా ఏర్పడ్డవే. అందుకు ఇటీవల వెలుగుచూసిన రుణాల ఎగవేత ఉదంతం అద్దం పడుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకే బ్యాంకుకు చెందిన వివిధ బ్రాంచుల్లో బోగస్ సంఘాల పేరుతో రూ.కోట్లలో బొక్కేశారు. ఈ వ్యవహారంపై అడిషనల్ కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించారు. మైనార్టీ సంక్షేమాధికారిని విచారణ అధికారిగా నియమించి పది రోజుల్లో నివేదిక కోరారు. ఈ నేపథ్యంలో మంగళవారం మొదలైన విచారణ ప్రక్రియ ఏ మేరకు లెక్క తేల్చుతుందో..? దోషులెవరో గుర్తిస్తుందా? ఆయా మెప్మా, ఆర్పీలు, మహిళా సంఘాల గ్రూపుల్లో ఉత్కంఠ నెలకొంది.
ఏదైనా లోన్ ఇవ్వాలంటే సవాలక్ష కొర్రీల నడుమ పెట్టే పరీక్షల్లో రుణగ్రహీత పాస్ అయితేనే రుణం ఇచ్చే బ్యాంకు లు.. కేవలం మహిళా సంఘాల సభ్యుల గుర్తింపు పత్రాలు, ఆర్పీలు ఇచ్చిన నివేదికలు, తీర్మానపత్రాల ఆధారంగానే రూ.కోట్లల్లో లోన్లు ఇచ్చాయి. కిస్తీలు వసూలు కాక, ఇచ్చిన నోటీసులు తిరిగి బ్యాంకుకే రావడం వంటి పరిణామాలతో మేల్కొన్న బ్యాంకు అధికారులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల ఓ బ్యాంకు అధికారి మున్సిపల్ కమిషనర్‌కు ఇచ్చిన లేఖతో బొక్కేసిన ఈ రుణాల బాగోతం వెలుగుజూసింది. ఇక ఆ బినామీ సంఘాల వ్యవహారం తేల్చేందుకు విచారణ ప్రారంభమైంది. అందులో భాగంగానే అసలు రుణ గ్రహీతలు ఎవరు? వారి గుర్తింపు కార్డుల ఆధారంగా ఇంకా ఏయే బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి.. ఏయే సంఘాల పేరుతో రుణాలు పొందారు? అన్న ఎంక్వైరీ మొదలైంది.
అంతా నడిపించింది వేళ్లమీద లెక్కించే దోషులే?
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రధాన బ్యాంకుకు సంబంధించిన బ్రాంచిలో 27 మహిళా సంఘాలకు సంబంధించి రుణాలు తిరిగి చెల్లించడం లేదు. రెండేండ్లయినా రూపాయి రాకపోవడం, డిఫాల్టర్లుగా పెట్టేందుకు నోటీసులు ఇస్తే చిరునామాలు సరిగా లేక తిరిగి బ్యాంకుకే రావడం వంటి పరిణామాల మధ్య బ్యాంకు అధికారులు అనుమానించారు. గతంలో ఉన్న అధికారులు, బ్యాంకు సిబ్బంది, ఆయా మెప్మాల్లోని ఉద్యోగుల మధ్య సమన్వయ లోపం.. లేక మామూళ్ల మధ్య సాగిన రుణ ప్రక్రియనో.. సుమారు 17 బోగస్ సంఘాలను సృష్టించి సంఘానికి రూ.7.50లక్షల రుణం చొప్పున రూ.1.27కోట్లు గోల్మాల్ అయినట్టు తేల్చారు. ఇలా నగరంలోని వివిధ బ్యాంకుల బ్రాంచీల్లో 287 సంఘాల పేరుతో రూ.14.35కోట్లు డ్రా చేసినట్టు వినిపిస్తోంది. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు కన్నేసి ఉంచకపోవడం కారణంగానే కొందరు మహిళా సంఘాల లీడర్లు, ఆర్పీలు, బ్యాంకు ఉద్యోగులు కలిసి ఈ పథకం రచించినట్టు తెలుస్తోంది. ఇలా నగరం మొత్తం మీద సాగిన ఈ బోగస్ బాగోతమంతా కేవలం వేళ్ల మీద లెక్కించే వారి కనుసన్నల్లో సాగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకే బ్యాంకులో లెక్క దొరకని 150 సంఘాల వివరాలు
రుణాలు తీసుకున్న వారు తిరిగి నెలవారీ కిస్తీలు కట్టకపోవడంతో వివిధ బ్యాంకుల అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే, ఆ నోటీసులన్నీ తిరిగి బ్యాంకులకే వస్తుండటం ఈ దందా వెలుగుజూసేందుకు ఉపకరించింది. నగరంలోని ఓ ప్రధాన బ్యాంకు బ్రాంచిలోనే సుమారు 150 సంఘాల వివరాలు సరిగా లేవని వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తోంది. ఒక్కో సంఘానికి రూ.5లక్షల చొప్పున ఇన్ని బోగస్ సంఘాల పేరుతో నొక్కేసిన సొమ్ము రూ.కోట్లలో ఉండటం గమనార్హం. గతంలో విచారణ చేసినా పూర్తిస్థాయి నివేదిక రాక మధ్యలోనే ఎంక్వైరీ నిలిచిపోయింది. ఇప్పుడు అలాంటిది జరగకుండా కరీంనగర్ మున్సిపల్ కమిషనర్, అడిషనల్ కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించి బోగస్ సంఘాల లెక్కతేల్చే పనిలో ఉన్నట్టు తెలిసింది.