Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నిర్మాణ రంగ కార్మికులు పోరాడి సాధించుకున్న 1996 కేంద్ర చట్టం, 1979 అంతర్ రాష్ట్ర వలస కార్మికుల రక్షణ చట్టాలను రక్షించుకుంటామని అఖిల భారత కన్స్‌స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సీడబ్ల్యూఎఫ్ఐ) జాతీయ అధ్యక్షులు సుఖ్బీర్సింగ్ చెప్పారు. భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించా లని డిమాండ్ చేస్తూ ఈ నెల రెండు, మూడో తేదీల్లో తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నిర్మాణరంగంలో వాడే ముడిసరు కుల ధరలను తగ్గించాలనీ, వాటిపై జీఎస్టీ ఎత్తేయా లని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ క్లయిమ్ లకు నిధులు విడుదల చేయాలని కోరారు. తెలం గాణ బిల్డింగ్, అదర్ కన్స్ట్రక్షన్ ఫెడరేషన్ (సీఐటీ యూ అనుబంధం) ఆధ్వర్యంలో మంగళవారం ఆన్లైన్ బహిరంగ సభను ఆ సంఘం అధ్యక్షులు వంగూరు రాములు అధ్యక్షతన నిర్వహించారు. సుఖ్బీర్సింగ్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోవిడ్ కాలంలో పనులు కోల్పోయిన కార్మి కులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కోవిడ్ కాలంలోనే కార్మిక వ్యతిరేక కోడ్లను, రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి దేశ ప్రజల ను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. రైతుల మడమ తిప్పని పోరాట ఫలితంగానే మూడు రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం ఉపసంహరించు కుందన్నారు. ఆ పోరాట స్ఫూర్తితో రెండు రోజుల సమ్మెను విజయవం తం చేయాలని పిలుపునిచ్చారు. సీడబ్ల్యూఎఫ్ ఉపా ధ్యక్షులు దెబెంజన్ చక్రవర్తి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వెల్ఫేర్ బోర్డుల్లో ఉన్న సుమారు 68 వేల కోట్ల రూపాయలను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడం కోసం చట్టాలను కేంద్రం మారుస్తు న్నదని విమర్శించారు. నేషనల్ మానిటైజే షన్ పైప ్లైన్ పేరుతో 13 ప్రభుత్వరంగ సంస్థలను లీజుల పేరుతో ప్రయివేటీకరిస్తూ ప్రజలపై భారాలు మోపు తున్నదని చెప్పారు. గతంలో ఉన్న భవన నిర్మాణ కార్మికుల ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను ఆన్లైన్ చేసి కార్మికుల పేర్లు నమోదు చేసుకోవడానికి, కార్మికులకు రావాల్సిన ప్రయోజనాలను దక్కకుండా అనేక నిబం ధనలు పెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణానికి వాడే సిమెంట్, స్టీల్, ఇసుక, ఇటుక తదితర ముడి సరుకుల ధరలు పెంచి సామాన్యులు నిర్మాణాలు చేసుకోకుండా, కార్మికులకు పని దొరకకుండా చేస్తున్నదన్నారు. తెలంగాణ బిల్డింగ్, అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. కోటంరాజు మాట్లాడుతూ.. తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్బోర్డులో మూడు వేల కోట్ల రూపాయల నిధులు జమయ్యాయనీ, ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణకు రావాల్సిన వాటా 450 కోట్ల రూపాయలు బ్యాంకులో మూలుగుతున్నాయని వివరించారు. భవన నిర్మాణ కార్మికులను ఆర్థికంగా ఆదుకోవడంలో, పెండింగ్‌లో ఉన్న 36 వేల క్లయిమ్‌లకు నష్టపరిహారాలకు నిధులు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. బోర్డు నుంచి దారిమళ్లించిన రూ. 1,005 కోట్లను తిరిగి జమచేయాలని డిమాండ్ చేశారు. కార్మిక శాఖలో పోస్టులను భర్తీ చేయాలని కోరారు. డిసెంబర్ 2న అన్ని మండల కేంద్రాల్లో ప్రదర్శనలు చేసి తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేయాలన్నారు. 3న జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు, ర్యాలీలు చేసి కలెక్టర్లకు, కార్మిక శాఖ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు.