Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ నేతల సంతాపం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజెస్ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిత్తలూరి భగత్సింహా (58) మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. నవంబర్ 27న రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయారు. ఆయన స్వగ్రామం నల్లగొండ జిల్లా వర్ధమానుకోట. భగత్సింహాకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన తండ్రి చిత్తలూరి రామస్వామి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య, రావినారాయణరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు వంటి కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులతో పనిచేశారు. భగత్సింహా కుటుంబ సభ్యులంతా కమ్యూనిస్ట్ భావాలతో కొనసాగుతున్నారు. భగత్ సింహా ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీ ఉద్యోగిగా చేరి యూనియన్ నిర్మించే క్రమంలో సస్పెండ్ అయ్యారు. యాజమాన్యాల ఒత్తిళ్లకు లొంగకుండా యూనియన్ నిర్మాణంలో క్రియాశీల పాత్ర పోషించారు. ఆయన అకాల మృతికి సీఐటీయూ రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేశ్, భూపాల్, ఎం.వెంకటేశ్, కోశాధికారి వంగూరు రాములు, టీఎమ్ఎస్ఆర్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.నాగేశ్వరావు, రంగారెడ్డి జిల్లా సీఐటీయూ కార్యదర్శి ఎం. చంద్రమోహన్, ఐలూ రాష్ట్ర కార్యదర్శి కె.పార్ధసారథి, సీఐటీయూ రాష్ట్ర నాయకులు పి. శ్రీకాంత్, కూరపాటి రమేష్, ఎ. సునీత, కీసరి నర్సిరెడ్డి, ఎల్లయ్య, వెంకన్న, కనకయ్య తదితరులు కామ్రేడ్ భగత్సింహా భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.