Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒప్పందంలో 'డబుల్'కు నెలనెలా బిల్లులు
- 6 నెలలుగా చెల్లించని సర్కార్
- పనులు బంద్ చేసిన కాంట్రాక్టర్లు
- పైగా పనులు చేయకుంటే బ్లాక్ లిస్టులో పెడతామని బెదిరింపులు
- రూ.1000కోట్ల బిల్లులు పెండింగ్
- ఇదీ గ్రేటర్ 'డబుల్' ఇండ్ల దుస్థితి
నవతెలంగాణ- సిటీబ్యూరో
గ్రేటర్లో పేదలకు లక్ష 'డబుల్' ఇండ్ల నిర్మాణానికి మొదట్లో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తే ప్రోత్సాహకాలు ఉంటాయని, నెలనెలా బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. చాలా మంది బిల్డర్లు, కాంట్రాక్టర్లు ముందుకొచ్చి టెండర్లు వేశారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం ఒప్పందాన్ని విస్మరించింది. పనులు పూర్తి చేసి ఆరు నెలలు, ఏడాదైనా బిల్లులు చెల్లించడం లేదు. పైగా పనులు ఆపేస్తే బ్లాక్ లిస్టులో పెడతామని ప్రభుత్వం హెచ్చరికలు జారీచేస్తోందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు బిల్లులు చెల్లించేదాక పనులు చేయలేమని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ భరోసా ఇస్తేనే పనులు చేస్తామని చెబుతున్నారు. దాంతో డబుల్ బెడ్ ఇండ్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఒకపక్క కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. మరోపక్క ఇండ్ల కోసం పేదలు ఎదురు చూస్తున్నారు. కానీ, వీటన్నింటిపై ఇంతవరకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేవారు లేరు.
లక్ష ఇండ్ల నేపథ్యం..
గ్రేటర్ హైదరాబాద్లో 2017లో రూ.9,714.59 కోట్లతో లక్ష ఇండ్లు నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది. 40 ప్రాంతాల్లో ఇన్సిటూ (పాత ఇండ్లను కూల్చేసి కొత్త నిర్మించడం)లో భాగంగా 8,898 ఇండ్లను 71 ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో 91,102ఇండ్లను నిర్మించాలని నిర్ణయించారు. వీటిలో హైదరాబాద్ జిల్లాలో 9,453, రంగారెడ్డి జిల్లాలో 23,908, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 38,419, సంగారెడ్డి జిల్లాలో 28,220 ఇండ్లు ఉన్నాయి.
ఇన్సిటూకే పరిమితం
లక్ష ఇండ్లల్లో 40ప్రాంతాల్లో ఇన్సిటూ(పాత ఇండ్లను కూల్చేసి కొత్త నిర్మించడం)లో భాగంగా 8,898 ఇండ్లను నిర్మిస్తున్నారు. వీటిలో ఇప్పటి వరకు 21ప్రాంతాల్లో 3,870 ఇండ్లను పూర్తిచేశాను. 2,493 ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు. మరో 1,377 ఇండ్లను లబ్ధిదారులకు అందజేయాల్సి ఉంది. కాని ఖాళీ ప్రదేశాల్లో నిర్మించిన 91,102 ఇండ్ల కోసం లబ్ధిదారులకు గుర్తించాల్సి ఉంది. అయితే 91,102 ఇండ్ల కోసం 10లక్షల దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. దరఖాస్తుల పరిశీలన, లబ్దిదారుల ఎంపిక విషయంలో సర్కార్ నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
60వేల ఇండ్లు రెడీ
ఇన్సిటూ ఇండ్లతోపాటు మరో 60వేల ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. మరో 30ఇండ్లకు సంబంధించిన మౌలిక వసతుల కల్పనతోపాటు ఆయా దశల్లో ఉన్నాయి. 40ప్రాంతాల్లో 60వేల ఇండ్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ చివరికి 31,059 ఇండ్లు, మార్చి 2022 వరకు 5,065 ఇండ్లు పూర్తవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.
రూ.1000కోట్ల బిల్లులు పెండింగ్
లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం రూ.9,714.59కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు రూ.6,406.71కోట్లు ఖర్చు చేశారు. లక్ష ఇండ్లు పూర్తి కావాలంటే మరో రూ.3,307.88కోట్లు అవసరం. పేమెంట్ కోసం రూ.400కోట్ల బిల్లులు సిద్ధంగా ఉన్నాయి. మరో రూ.600కోట్లకు సంబంధించిన పనులకు బిల్లులు తయారు చేయాల్సి ఉంది. పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు బంద్ చేశారు. దీంతోపాటు తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీల ఏర్పాటుకు మరో రూ.400కోట్లు అవసరమని అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా లబ్దిదారుల ఎంపిక జరగకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన రూ.750కోట్లు పెండింగ్లో పెట్టారు.
ఇండ్ల పంపిణీలో సర్కార్ విఫలం : సీపీఐ(ఎం)
పేదలకు ఇండ్లు పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ విమర్శించారు. సర్కార్ విడుదల చేసిన మార్గదర్శకాల అమలు అటకెక్కాయని అన్నారు. మార్గదర్శకాలను విడుదల చేసి ఏడాది కావొస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే నిధులు విడుదల చేసి.. నిర్మాణాలు పూర్తిగా చేపట్టి పేదలకు పంచాని డిమాండ్ చేశారు.