Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పుడు ప్రచారం నమ్మొద్దు.. అన్ని చర్యలు తీసుకున్నాం
- వ్యాక్సిన్ పై నిర్లక్ష్యం వద్దు : డీహెచ్ జి శ్రీనివాసరావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల నమోదుపై అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మన దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని చెప్పారు. కొత్త రకమైన కేసులు వస్తే ప్రభుత్వమే నేరుగా ప్రకటిస్తుందని చెప్పారు. కొత్త వేరియంట్ పై సీఎం కేసీఆర్ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారన్నారు. ఇతర దేశాల్లో ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో రిస్కు దేశాలుగా గుర్తించిన 12 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు.. విదేశాల నుంచి వచ్చేవారిని నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయిన వారిని ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. ఒమిక్రాన్ కేసులు గుర్తించిన 12 దేశాల నుంచి 40 మందికి పైగా మన రాష్ట్రానికి వచ్చారని.. వారందరికీ నెగటివ్ రావడంతో హౌం క్వారంటైన్‌కి పంపినట్టు వెల్లడించారు. వారి ఆరోగ్యాన్ని 14 రోజులు గమనిస్తామని వివరించారు. ఒమిక్రాన్‌కు డెల్టా కంటే ఆరు శాతం వేగంగా వ్యాపిస్తున్నట్లు గుర్తించారనీ, కానీ వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటోందన్నారు. ఎన్ని మ్యుటేషన్లు వచ్చినా కొవిడ్ నిబంధనలను పాటిస్తే మనల్ని మనం కాపాడుకోవచ్చని సూచించారు. ఈ నెల 11 నుంచి రిస్కు దేశాల నుంచి వచ్చిన వారెవరిలో ఒమిక్రాన్ బయటపడలేదని స్పష్టం చేశారు.
ఇంత నిర్లక్ష్యమెందుకో అర్థం కావడం లేదు....
కరోనా వ్యాక్సిన్ వేసుకోకుండా ప్రజల్లో ఇంత నిర్లక్ష్యం ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదని డీహెచ్ డాక్టర్ జి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపద్రవం వస్తేనే పరుగులు తీస్తామనీ, ప్రాణాలను కాపాడేందుకు కరోనా వ్యాక్సిన్లను ఉచితంగా వేస్తామన్నా....ముందుకు రాకపోవటం సరికాదని హితవు పలికారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వ్యాధి తీవ్రత, మరణాలు తక్కువగా ఉంటున్నట్టు ఇప్పటికే స్పష్టమైందని డీహెచ్ గుర్తుచేశారు. ప్రజలు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.