Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముడి సరుకుల ధరలను నియంత్రించాలి
- ఈ శ్రమ్‌లో కార్మికులను నమోదు చేయాలని డిమాండ్
- 2, 3న దేశవ్యాప్త సమ్మె
- పాల్గొననున్న 54 రకాల వృత్తుల కార్మికులు
నవతెలంగాణ - నల్లగొండ ప్రాంతీయప్రతినిధి
ప్రజా పోరాటాల ముందు ఎంత పెద్ద నాయకుడైనా తలవంచి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనని రైతు ఉద్యమం నిరూపించింది. అదే రైతు ఉద్యమ స్ఫూర్తితో భవన నిర్మాణ రంగ కార్మికులు కూడా తమ హక్కుల సాధన కోసం ఈనెల 2,3 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చారు. రెండ్రోజుల పాటు పనులన్నీ బంద్ చేసి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. 54 రకాల వృత్తులకు సంబంధించిన కార్మికులు సమ్మెలో పాల్గొనన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రెండ్రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మెలో భాగంగా 2న మండల కేంద్రాల్లో కార్మికులందరూ తమ పనులు పూర్తిగా నిలిపేసి నిరసన కార్యక్రమాలు చేపట్టను న్నారు. 3న జిల్లా కేంద్రాల్లో నిరసన, ప్రదర్శనలు చేస్తారు. ఇందుకనుగుణం గా ఇప్పటికే ఆయా సంఘాల నాయ కులు కార్యాచరణ రూపొందించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సెంట్రింగ్, తాపీమేస్త్రీ, పెయింటింగ్, తదితర వృత్తులతో పాటు 54 రకాల వృత్తులకు సంబంధించిన లక్షా 50 వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారు. ఇప్పటికే ఆయా కార్మిక సంఘాల నేతలతో సీఐటీయూ నాయకులు సమావేశం నిర్వహించి సమ్మెను విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నారు.
కార్మిక చట్టాలకు తూట్లు
భవన నిర్మాణ, ఇతర కార్మిక కార్మికుల పోరాటాలు, వామపక్ష పార్టీల అండతో 1996లో నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం, 1979 అంతరాష్ట్ర కార్మికుల చట్టాలను సాధించుకున్నారు. వాటి ద్వారానే కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు పొందుతున్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్లుగా మార్చింది. పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండానే కార్మిక చట్టాలను రద్దు చేసి తమకు అనుకూలమైన వాటిని తీసుకొచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 2000 వరకు కార్మికుల క్లైమ్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి నిధులు లేని కారణంగా కార్మిక కుటుంబాలకు న్యాయం జరగడం లేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాల కార్మికులకు మేలు జరిగే ఈ శ్రమ్ పథకంలో కార్మికులను నమోదు చేయాలని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, చట్టం చెబుతుంటే ఏ అధికారి కూడా నమోదుకు శ్రీకారం చుట్టలేదు. దానికి బడ్జెట్ లేదని చెబుతున్నారు. పెరిగిన ముడిసరుకుల ధరలతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫలితంగా కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. కరోనా ప్రభావం, ఉపాధి దొరక్క పోవడంతో కార్మిక కుటుంబాలు పస్తులుంటున్నాయి. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ కార్మికులు సమ్మెకు సిద్దమవుతున్నారు.
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ఇవే..
- భవన నిర్మాణ రంగంలో వాడే ముడిసరుకుల ధరలను వెంటనే నియంత్రించాలి. వాటిపై జీఎస్టీ పన్నులను కూడా తొలగించాలి
- ఈ శ్రమ్ పథకంలో భవన నిర్మాణ కార్మికుల పేర్లు నమోదు చేసేలా చర్యలు చేపట్టాలి. పెండింగ్‌లో ఉన్న క్లైమ్లకు వెంటనే నిధులు విడుదల చేయాలి.
- భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న 1996 కేంద్ర చట్టం, 1979 అంతరాష్ట్ర వలస కార్మికుల రక్షణ చట్టాన్ని కాపాడాలి.
కార్మికులను అణచే కుట్ర : తుమ్మల వీరారెడ్డి
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మికులను అణచివేసేందుకు కుట్ర పన్నుతోంది. కార్మిక చట్టాలను తుంగలో తొక్కి కార్మికులకు సంక్షేమ పథకాలు అందకుండా చేస్తుంది. అందుకే కార్మిక హక్కులను రక్షించుకునేందుకు సమ్మెకు పిలుపునిచ్చాం. ఇప్పటికే కార్మికులు అందుకు సిద్ధమయ్యారు.