Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లీజ్.. టారిఫ్ ప్రపోజల్స్ ఇవ్వండి
- డిస్కంలకు టీఎస్ఈఆర్సీ వేడుకోలు
- రెండేండ్ల ఏఆర్ఆర్ల సమర్పణ
- ఆదాయలోటు రూ.21,552 కోట్లు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
''రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల ప్రతిపాదనలు (ఏఆర్ఆర్) సమర్పించాయి. అయితే టారిఫ్ ప్రతిపాదనలు మాత్రం ఇవ్వలేదు. 'త్వరలో' వాటిని కూడా ఇవ్వాలని కోరుతున్నాం'' డిస్కంలకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) వేడుకోలు ఇది. అంతకు ముందు మూడేండ్ల ఏఆర్ఆర్లను డిస్కంలు సమర్పించలేదనీ, వాటిని ట్రూఅప్గా స్వీకరించామని ఈఆర్సీ చైర్మెన్ టీ శ్రీరంగారావు, సభ్యులు ఎమ్డీ మనోహర్రాజు, బండారు కృష్ణయ్య తెలిపారు. అయితే వాటిని ట్రూఆప్గా స్వీకరించమని డిస్కంలు తమను కోరుతూ ఎలాంటి లేఖలు రాయలేదని చెప్పారు. మంగళవారం టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్, సెస్ సంస్థలు సంయుక్తంగా రెండేండ్ల ఏఆర్ఆర్లను సమర్పించినట్టు వారు వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో పలు అంశాలను ప్రస్తావించారు. గడచిన ఆరేండ్లుగా ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచలేదన్నారు. ఈసారి పెంచినా, అవి భరించలేనంతగా ఏమీ ఉండవనీ చెప్పారు. అయితే డిస్కంలు టారిఫ్ ప్రతిపాదనలు ఇస్తే, తమ పని ప్రారంభిస్తామనీ, కొత్త టారిఫ్ 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. అయితే 2021-22 ఆర్థిక సంవత్సర ఏఆర్ఆర్లను 2020 నవంబర్లో ఇవ్వాల్సి ఉండగా, ఏడాది ఆలస్యంగా డిస్కంలు
ఇచ్చాయి. దీనికి ఎలాంటి కారణాలను చెప్పలేదని ఈఆర్సీ తెలిపింది. తాము మాత్రం ఏటా లేఖలు రాస్తూనే ఉన్నామని టీఎస్ఈఆర్సీ చైర్మెన్ చెప్పుకొచ్చారు. డిస్కంల ఆదాయలోటు భర్తీని ఏడాది పాటు కొనసాగించకుండా ప్రతి మూడునెలలకోసారి వసూలు చేసుకొనేలా చర్యలు తీసుకోవాలనే కేంద్రప్రభుత్వ లేఖ తమకు అందిందని వారు తెలిపారు. అయితే అలాంటి ప్రతిపాదనలు ఏవీ డిస్కంలు తమకు ఇవ్వలేదన్నారు. అయితే ఈఆర్సీ చైర్మెన్ ఇచ్చిన అధికారిక పత్రికా ప్రకటనలో 2021-22 ఆర్థిక సంవత్సర ఏఆర్ఆర్లకు సంబంధిచిన అంశాలు ఏవీ లేవు. 2022-23 ఏఆర్ఆర్లు మాత్రమే ఇచ్చినట్టు పేర్కొన్నారు.
ఇష్టారాజ్యం
విద్యుత్ చట్టం-2003 ప్రకారం డిస్కంలు పూర్తిగా నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నాయి. స్వయం ప్రతిపత్తితో వ్యవహరించాల్సిన విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. గడచిన నాలుగేండ్లుగా ఈఆర్సీకి డిస్కంలు ఏఆర్ఆర్లు సమర్పించకపోయినా, వాటిపై ఎలాంటి చర్యలు లేవు. చట్టంలోని లోసుగులను ఆసరా చేసుకొని, ట్రూఆప్ పేరుతో ఏఆర్ఆర్లు ఇచ్చినట్టే భావిస్తున్నాయి. అయితే ఏఆర్ఆర్లు ఇవ్వని డిస్కంలకు ట్రూఆప్ క్లెయిమ్ చేసుకొనే అవకాశం ఉండబోదని కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) పలుమార్లు స్పష్టంచేసింది. అయినా 'రాజుతలుచుకుంటే దెబ్బలకు కొదవ లేనట్టే' సంస్థలు వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు డిస్కంల నష్టాలు, ఆదాయలోటును సాకును చూపి, ఒకేసారి ప్రజలపై భారాలు మోపేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధమవుతున్నాయి. టారిఫ్ ఆర్డర్ ఇవ్వకుంటే ఏఆర్ఆర్లు స్వీకరించేది లేదని తేల్చిచెప్పాల్సిన ఈఆర్సీ, త్వరలో ఇవ్వండని కోరడమంటే వ్యవస్థల్లోని డొల్లతనం వెల్లడవుతున్నది. 2021-22 ఆర్థిక సంవత్సర ఏఆర్ఆర్లను 2020 నవంబర్లో ఇవ్వాల్సి ఉంది. డిస్కంలు పట్టించుకోలేదు. ఈఆర్సీ రికార్డుల నిర్వహణ కోసం 'త్వరలో' ఇవ్వాలని లేఖలు రాసింది. ఆ 'త్వరలో' ఏడాది తర్వాత అని అర్థం వచ్చేలా ఈ ఏడాది నవంబర్లో డిస్కంలు ఏఆర్ఆర్లు ఇచ్చాయి. ఫలితంగా రెండేండ్ల భారాలను ఒకేసారి ప్రజలపై మోపే ప్రమాదం పొంచిఉంది. ఇప్పటికే ఆర్టీసీ చార్జీలతో పాటు కరెంటు చార్జీలను కూడా పెంచుతామని సీఎం కేసీఆర్ శాసనసభలోనే ప్రకటన చేశారు. దానిలోభాగమే ఇప్పుడీ ప్రతిపాదనల సమర్పణ. 2022 ఏప్రిల్ 1 నుంచి ప్రజలపై కరెంటు చార్జీల భారం పడే అవకాశాలు ఉన్నాయి.