Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతర ఏర్పాట్లపై మంత్రి సత్యవతి సమీక్ష
నవతెలంగాణ-తాడ్వాయి
మేడారం జాతరకు వచ్చే జనం మెచ్చేలా అభివృద్ధి పనులు శాశ్వత ప్రాతిపదికన ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లాలోని మేడారంలోని సమ్మక్క సారలమ్మ వనదేవతలను జెడ్పీ చైర్పర్సన్ కుసుమ జగదీష్, ఎమ్మెల్యే ధనసరి అనసూయ, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠిలతో కలిసి మంత్రి సత్యవతి బుధవారం దర్శించుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర జరగనున్న నేపథ్యంలో సందర్శకులకు వసతుల కల్పన, జంపన్నవాగు వద్ద చెక్ డ్యామ్ పనులను మంత్రి పరిశీలించారు. జంపన్న వాగు వద్ద స్నానఘట్టాలు, దుస్తుల మార్పిడి గదులు, ప్రమాదాలు సంభవించకుండా తీసుకుం టున్న చర్యలు, వసతి సౌకర్యాలపై పర్యవేక్షించారు. అనంతరం మేడారంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా జాతర నిర్వహణకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఆరోగ్య శాఖ సేవలు కీలకమన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని చెప్పారు. సందర్శకులు కోవిడ్-19 నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలని, జాతర నాటికి పనులన్ని టినీ పూర్తి చేయాలని అన్నారు. ములుగు జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల్లో నాణ్యత కీలకమన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు సక్రమంగా లేవని ఎస్ఈ రామచంద్ర నాయక్‌పై అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ జనవరి మొదటి వారంలోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, ఎంపీపీ గొంది వాణిశ్రీ, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు రియాజ్ మిర్జా, వలీయాబీ, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ పల్లా బుచ్చయ్య, మేడారం సర్పంచ్ చిడం బాబురావు, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ సీఈ శంకర్, ఈఓ రాజేందర్, ఆర్ అండ్ బీ ఎస్ఈ నాగేందర్రావు, ఈఈ వెంకటేష్, పంచాయతీరాజ్ ఎస్ఈ జోగారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రామచంద్రం, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఐటీడీఏ ఏపీఓ వసంతరావు, ఈఈ హేమలత తదితరులు పాల్గొన్నారు.