Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూములు కోల్పోయిన రైతుల దీక్ష
- పురుగు మందు డబ్బాలతో నిరసన
- 15 రోజుల్లో సర్వే చేసి భూములు కేటాయిస్తాం : తహసీల్దార్
నవతెలంగాణ-సదాశివనగర్
తమకు భూములు కేటాయించేవరకూ జ్యూట్ పరిశ్రమలో పనులు నిలిపివేయాలని భూములు కోల్పోయిన రైతులు డిమాండ్ చేశారు. బుధవారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని లింగంపల్లి శివారులో జ్యూట్ పరిశ్రమ ఏర్పాటు చేయనున్న స్థలంలో జనగామ, కరడ్పల్లి, లింగంపల్లి గ్రామాల రైతులు నిరాహారదీక్ష చేపట్టారు. మహిళా రైతులు పురుగు మందు డబ్బాలతో నిరసన తెలిపారు. పనుల్లో భాగంగా వెళ్తున్న లారీలను అడ్డుకుని పనులను నిలిపివేశారు. ఈ సందర్భంగా తెలంగాణ భూ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న, బాధిత రైతులు మాట్లాడుతూ.. మూడు గ్రామాల్లో దాదాపు 700 ఎకరాల్లో 650 ఎకరాలు సాగు భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా జ్యూట్ పరిశ్రమలో రోడ్డు పనులు ఎలా చేపడుతున్నారని కంపెనీ అధికారులను ప్రశ్నించారు. భూములు కోల్పోయిన రైతులకు తక్షణమే వేరేచోట భూములు కేటాయించాలని డిమాండ్ చేశారు. భూములు కేటాయించే వరకూ పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ వెంకట్రావ్ ఆందోళన చేస్తున్న స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. భూములు కోల్పోయిన రైతులకు 15 రోజుల్లోనే సర్వే చేసి భూములు కేటాయిస్తామని తెలపడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో రైతులు ఎడ్ల సాయిలు, కమిళ్ల ప్రసాద్, భాస్కర్, గట్టు భాస్కర్, రాజశేఖర్, కీసరి సాయిలు, రాజయ్య, బాలు రైతులు తదితరులు పాల్గొన్నారు.