Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెనూ ఛార్జీలు పెంచాలి
- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ-కంఠేశ్వర్/ఆర్మూర్‌టౌన్
మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి టి.చక్రపాణి డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి.. కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నూర్జహాన్, టి.చక్రపాణి మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులు రూ.10 కోట్లు మంజూరు చేయాలనీ, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు, వేతనాలు పెంచాలనీ, గుడ్డుకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి ఏజెన్సీకి ముద్ర లోన్ కింద బ్యాంకుల నుంచి రుణం ఇప్పించాలని కోరారు. మెనూ చార్జీలతోనే అవసరమైన సరుకులు కొనుగోలు చేయాల్సి వస్తుందనీ, పైగా వారానికి మూడు గుడ్లు పెట్టాలని ఒత్తిడి తెస్తున్నారనీ, కేటాయించిన బడ్జెట్ రెండు గుడ్లకు కూడా సరిపోవడం లేదని వాపోయారు. గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలనీ, లేదా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్టుగా ప్రభుత్వమే నేరుగా గుడ్లు సరఫరా చేయాలన్నారు. 19 ఏండ్లుగా మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచక మౌలిక వసతులు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ పథకంలో పని చేసే వారంతా బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళలేననీ, వీరి శ్రమను గుర్తించి కనీస వేతనం రూ.15వేలు ఇవ్వాలని కోరారు. ఒక విద్యార్థికి రూ.15ల స్లాబ్ రేటు పెంచాలని డిమాండ్ చేశారు.
వంట సామగ్రి, వంట గదులు లేని దగ్గర నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు లక్ష్మి, జిల్లా నాయకులు సుజాత, కొండ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంఈవో కార్యాలయ సిబ్బందికి సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. సీఐటీయూ నాయకులు వెంకటేష్, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం అధ్యక్షురాలు జక్కం సుజాత మాట్లాడుతూ.. ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.