Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో ఏడాదిగా మావోయిస్టుల కదలికలు లేవు
- మావోయిస్టులను ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధమే: డీజీపీ మహేందర్ రెడ్డి
నవతెలంగాణ-భద్రాచలం
తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా పని చేస్తున్నామని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని చర్ల మండలంలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. మావోయిస్టులు అత్యధికంగా సంచరించే అరణ్య ప్రాంతమైన చెన్నాపురంలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ బేస్ క్యాంప్‌ను పర్యవేక్షించారు. జవాన్లలో మనోధైర్యాన్ని కల్పించడం, జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు వ్యవస్థను మానిటరింగ్ చేయడం కోసం పర్యటించినట్టు విశ్వసనీయ సమాచారం. కాగా, గురువారం నుంచి మావోయిస్టులు పీఎల్జీఏ వారోత్సవాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మావోయిస్టు ఇలాకాలో డీజీపీ పర్యటన చర్చనీయాంశంగా మారింది. చెన్నాపురానికి డీజీపీ ప్రత్యేక హెలికాఫ్టర్‌లో చేరుకోగా.. జిల్లా ఎస్పీ సునీల్‌దత్ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడంతో పాటు ఉన్నతాధికారులతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలోని సారపాక ఐటీసీ పీఎస్పీడీ గెస్ట్‌హౌస్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో మావోయిస్టుల కదలికలు తగ్గించి ఛత్తీస్‌గఢ్‌లో షెల్టర్ తీసుకుంటున్నారని తెలిపారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఎస్పీలు, సీనియర్ ఆదికారులతో ప్రభావిత ప్రాంతాలను పరిశీలించాననీ, పోలీస్ ఆధికారుల పనితీరు భేషుగ్గా ఉందని అన్నారు. మావోయిస్టు సమస్యను ఎదుర్కోవటానికి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోనేలా ఇరు జిల్లాల ఎస్పీలు ఆప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. ఈ ప్రాంతాల అభివృద్ధికి కలెక్టర్లు, ప్రాజెక్టు డైరెక్టర్ల సహాయ సహకారాలతో ప్రజల అవసరాలను తీర్చడం, రోడ్లు, తదితర వసతులు కల్పిస్తున్నారన్నారు. ప్రజల సహకారంతో మావోయిస్టు సమ స్యను అధిగమింగలిగామని, ప్రజలు సైతం ప్రశాంత జీవన విధానం కొనసాగిస్తున్నారన్నారు. సమావేశంలో అడిషనల్ డీజీపీ సీఆర్సీఎఫ్ లక్ష్మీశుక్లా, అడిషనల్ డీజీపీ గ్రేహౌండ్స్ శ్రీనివాసరెడ్డి, ఓఎస్డీ తిరుపతి, ఏఎస్సీలు శబరీష్, వినీత్, అకాన్స్, రోహిత్ రాజు పాల్గొన్నారు.