Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్లకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈ నెలాఖరు నాటికి వంద శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అదే సమయంలో ప్రజలు మాస్కులు ధరించటం, వ్యాక్సిన్ వేసుకోవటం తదితర కరోనా నియంత్రణ చర్యలను కొనసాగించాలని విజ్ఞప్తి చేసింది. ప్రజలకు ఎప్పటికప్పుడు శాస్త్రీయమైన సమాచారాన్ని అందించాలనీ, తద్వారా వారిని మరింత చైతన్యపరచాలని ప్రభుత్వాధికారులకు సూచించింది. సంపూర్ణ వ్యాక్సినేషన్ లక్ష్యం కోసం అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించింది. బుధవారం హైదరాబాద్‌లోని బి.ఆర్.కె.భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సబ్ కమిటీ సమావేశానికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధ్యక్షత వహించగా, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల సమన్వయంతో డిసెంబర్ నాటికి 100 శాతం వ్యాక్సినేషన్ లక్ష్యాలను సాధించుటకు ఆవాసాలు , వార్డులు , సబ్ సెంటర్లు, మున్సిపాల్టీలు , మండలాల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్లుకు సూచించారు.
మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన, ఆర్టీపీసీఆర్ సెంటర్ల ఏర్పాటుకు అనువైన వసతులు, స్థలాలను కేటాయించాలని కోరారు. అదనపు పడకల ఏర్పాటు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. కేటీఆర్ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు ప్రచారాల పట్ల అప్రమత్తంగా వ్యహరించాలని సూచించారు. ప్రజలకు సరైన సమాచారాన్ని, సూచనలను ఎప్పటికప్పుడు అందించడమే ఇందుకు పరిష్కార మార్గమని తెలిపారు. ఆస్పత్రుల్లో ఉన్న బెడ్లపై ప్రజలకు సమాచారమివ్వాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో గతంలో నెలకొల్పిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను తిరిగి నిరంతరాయంగా పని చేయించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యా సంస్థల్లో అవసరమైన చోట వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేసి 100 శాతం లక్ష్యాలను సాధించాలని అధికారులకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.