Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంతాన నిరోధక ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటు
- అటవీ, వెటర్నరీ, వ్యవసాయ శాఖల నిపుణులతో ప్రత్యేక కమిటీ : ఉన్నతస్థాయి సమీక్షలో సీఎస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కోతులు, అడవి పందుల బెడదను నివారించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. కోతులు, అడవి పందుల బెడదపై బుధవారం ఆయన హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కోతుల బెడద అధికంగా ఉండి రైతులు, సామాన్య ప్రజానీకం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారనే అంశం ఇటీవల మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ బెడద నివారణకు చేపట్టాల్సిన చర్యలను సూచించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో సమావేశం నిర్వహించామని వివరించారు. వివిధ రాష్ట్రాల్లో కోతుల బెడద నివారణకు తీసుకున్న చర్యలపై చర్చించామని పేర్కొన్నారు. వాటి నివారణపై చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి సూచనలు ఇచ్చేందుకు అటవీ, వెటర్నరీ, వ్యవసాయ శాఖల నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇది వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసి తగు ప్రతిపాదనలు వారంరోజుల్లోగా సమర్పించాలని పేర్కొన్నారు. కోతుల సంఖ్య తగ్గించడం, నియంత్రించేందుకు మరిన్ని సంతాన నిరోధక ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేస్తామని వివరించారు. పంటలను కోతుల నుంచి కాపాడటానికి పలు సాంప్రదాయక విధానాలపై రైతులు, పౌరులను చైతన్య పరచాలని నిర్ణయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పీసీసీఎస్ శోభ, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్‌రావు, వెటర్నరీ విశ్వవిద్యాలయం వీసీ రవీందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణతోపాటు పలువురు ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.