Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో ప్రదర్శించే సినిమా టికెట్ల ధరల పెంపునకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ధరల పెంపునకు అనుమతి కోసం థియేటర్ల యాజమాన్యాలు ప్రభుత్వానికి చేసుకున్న దరఖాస్తులను ఆమోదించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం జస్టిస్ బి విజరుసేన్రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అఖండ, ఆర్ఆర్ఆర్, పుష్ప, రాధేశ్యాం తదితర భారీ బడ్జెట్ సినిమాల టికెట్ల ధరలను పెంపుదల చేయాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నా చర్యలు తీసుకోలేదంటూ లలిత, శశికళ, చంద్రకళ థియేటర్ల యజమానులు రిట్లు దాఖలు చేశారు. టికెట్ ధర పెంపునకు అనుమతి కోరితే ప్రభుత్వం స్పందించడం లేదంటూ థియేటర్ల యాజమాన్యల తరఫు న్యాయవాది వాదించారు. 2017లో వెలువడిన జీవో నెంబర్ 75 ప్రకారం టికెట్ల ధరల పెంపునకు వీలుందనీ, అయితే జీవో వెలువడిన వారానికే ఆ జీవో అమలును ప్రభుత్వం నిలిపివేసిందనీ, ధరలు పెరిగిన దృష్ట్యా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. టికెట్ల ధరల వివాదంపై సినీ ప్రేక్షక సంఘం అధ్యక్షుడు వేసిన ఇంప్లీడ్ పిటిషన్ విచారణలో ఉందన్నారు. ఈ కేసులన్నింటినీ తర్వాత విచారిస్తామనీ, ఈలోగా థియేటర్ యజమానులు దాఖలు చేసిన దరఖాస్తులను ప్రభుత్వం ఆమోదించాలని మధ్యంతర ఉత్వర్వులు జారీ చేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. విచారణను వాయిదా వేశారు.