Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కారులో ఉన్న ఇద్దరితో పాటు గజఈతగాడూ మృతి
నవతెలంగాణ- దుబ్బాక రూరల్
రోడ్డుపై వెళుతున్న కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. దాంతో కారులో వారిని రక్షించాలన్న ఉద్దేశంతో శాయశక్తుల ప్రయత్నించిన గజఈతగాడూ ప్రమాదవశాత్తు మృతిచెందాడు. వెలికితీసిన కారులో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామపరిధిలో బుధవారం చోటుచేసుకుంది. కారులో మృతి చెందిన వారిని తల్లి భాగ్యలక్ష్మి, కొడుకు ప్రశాంత్‌గా పోలీసులు నిర్థారించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన భాగ్యలక్ష్మి(50), ఆమె కుమారుడు ప్రశాంత్(25) కలిసి నందిగామ నుంచి హస్నాబాద్‌కు బుధవారం ఉదయం కారులో బయల్దేరారు. చిట్టాపూర్ వద్దకు చేరుకున్న సమయంలో కారు టైరు పేలడంతో అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లింది. గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది.. గజఈతగాళ్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు ఘటనాస్థలానికి చేరుకొని సహాయ చర్యలను పరిశీలించారు. దాదాపు 45 నుంచి 60 లోతున ఉన్న బావి నుంచి కారును తీసేందుకు దాదాపు 6గంటల పాటు గజఈతగాళ్లు తీవ్రంగా శ్రమించారు. ముందుగా మోటార్ల సాయంతో నీటిని తోడివేశారు. అనంతరం గుర్తించిన కారుకు క్రేన్ తాడును బిగించేందుకు గజఈతగాడు నర్సింహులు వెళ్లాడు. తాడు బిగించి పైకి వచ్చే క్రమంలో కారుకు చిక్కికుపోయి ఊపిరాడక నీటిలోనే మృతిచెందాడు. క్రేన్ సాయంతో కారును బయటకు తీయగా.. అందులో తల్లీకొడుకు మృతదేహాలతో పాటు నర్సింహులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.