Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
'మేకల వలే కాదు, సింహంలా ఉండండి' అని చెప్పిన బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జీవించిన ఈశ్వరీ బాయి.. ఆయన ఆశయాలకు వారసురాలని గవర్నర్ తమిళిసై సౌందరజన్ అన్నారు. బుధవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, జె.ఈశ్వరీ బాయి స్మారక నిధి సంయుక్త నిర్వహణలో ఈశ్వరీబాయి జయంతి నిర్వహించారు. ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డికి గవర్నర్ స్మారక పురస్కారం బహుకరించి మాట్లాడారు. ఈశ్వరీ బాయి ధీరవనిత, లంచగొండుల పాలిట సింహస్వప్నమని కొనియాడారు. కరోనా ఇంకా పోలేదని తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని, మాస్క్ ఉపయోగించుకోవాలని సూచించారు. పర్యాటక శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల మహిళల శ్రేయస్సుకు పోరాడిన ఈశ్వరీ బాయి శాసన సభ్యురాలిగా రాజీ పడలేదని వివరించారు. హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. మానవతా మూర్తి ఈశ్వరీబాయి.. కుమార్తెగా గీతా రెడ్డి ఆమె వారసత్వాన్ని పుణికి పుచుకొన్నారని అభినందించారు. ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజి చైర్మెన్ నాగేశ్వర్ రెడ్డి కోవిడ్ ప్రస్తుత పరిస్థితిపై ప్రసంగించారు. ఒమిక్రాన్ వైరస్ 70 శాతం ప్రమాదకారి కాదని, మరణాలు సంభవించవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ పాల్గొన్నారు.