Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
- సినిమాను తిలకించిన మంత్రి, అధికారులు
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
వామపక్ష భావజాలం ఉన్న సినీ హీరో ఆర్.నారాయణ మూర్తి నటించిన 'రైతన్న' మూవీ వాస్తవాలకు ప్రతిబింబమని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస థియేటర్లో బుధవారం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అధికారులతో కలిసి మంత్రి రైతన్న మూవీని చూశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. దుక్కి దున్నడం, విత్తనం వేయడం మొదలుకొని పంటలు పూర్తిగా చేతికొచ్చే వరకు రైతులు పడే బాధలు, పండిన పంట మార్కెట్‌కు చేరవేయడానికి, చేరవేసిన పంటకు మద్దతు ధర, ప్రకృతి వైపరీత్యాలు తదితర అంశాల గురించి ఈ చిత్రంలో కండ్లకు కట్టినట్లు చూపించారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలు రైతులకు గొడ్డలి పెట్టుగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలిగేలా విద్యుత్ వినియోగానికి మోటార్లు బిగించుకోవాలనడం బాధాకరమన్నారు. ఇలాంటి చిత్రాలు మరెన్నో తీయాలని ఆకాంక్షించారు. మున్సిపల్ చైర్మెన్ కేసీ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మెన్ కోరమని వెంకటయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ రాజేశ్వర గౌడ్ తదితరులు సినిమా చూశారు.