Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం కొనుగోలులో కేంద్రానికి చిత్తశుద్ధి లేదు
- ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ
కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థలు నిర్వీర్య మయ్యాయని శాసనమండలి మాజీ చైర్మెన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అధికారాలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకొని హక్కులను హరిస్తోందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో శ్రద్ధతో కొనుగోలు చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్‌సీఐ సహకారం లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రాష్ట్రంలో గత రబీలో కొనుగోలు చేసిన బియ్యానికి సరిపడా రైల్వే వ్యాగన్లు ఏర్పాటు చేసి, ఎఫ్‌సీఐ గోదాముల్లో ఉన్న బియ్యం ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయకపోవడమే ప్రధాన కారణమని అన్నారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సంవత్సర కాలంగా రైతులు ధర్నా చేస్తే ఇబ్బందులకి గురిచేసింది బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. 750 మంది రైతుల మరణానికి కేంద్ర ప్రభుత్వం కారణమైందన్నారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన వైఖరి తెలియజేయాలన్నారు. తెలంగాణలోని రైతుల ఇబ్బందులు, మనోవేదన కేసీఆర్ మాటలకి ప్రతిబింబమన్నారు. గతంలో కేంద్ర ఫైనాన్స్ నిధులు 50 శాతం గ్రామపంచాయతీలకు, 30 శాతం మండల పరిషత్‌లకు, 20శాతం జిల్లా పరిషత్‌లకు విడుదలయ్యేవన్నారు. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కొట్లాడి 10శాతం మండల పరిషత్‌లకు, 10శాతం జిల్లా పరిషత్‌లకు నిధుల విడుదలకు కృషి చేసిందని చెప్పారు. ఈనెల 10వ తేదీ జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున పోటీచేస్తున్న ఎంసీ కోటిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మెన్ బండ నరేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్.భాస్కరరావు, నల్లగొండ జెడ్పీ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి ఉన్నారు.