Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ మత రాజకీయాలు మానుకోవాలి
- మైనార్టీలపై దాడులను నిరసిస్తూ ర్యాలీలు
నవతెలంగాణ- విలేకరులు
మైనార్టీలు, వారి హక్కులపై జరుగుతున్న దాడులను సహించేది లేదని సీపీఐ(ఎం), ప్రజాసంఘాలు హెచ్చరించాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో మత ప్రాతిపదికన రాజకీయాలు చేస్తున్న బీజేపీ విధానాలను మానుకోవాలని హెచ్చరించారు. సంఫ్‌ుపరివార్ మతం పేరుతో రాజకీయాలు చేస్తూ.. కలహాలు సృష్టిస్తోందన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు తీశారు. ఇందిరాపార్క్ వద్ద గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్, హైకోర్టు అడ్వకేట్ ఖుద్దుస్ గౌర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మతవిదేష్వాలు రగిల్చి.. మైనార్టీల కనీస హక్కులను కాలరాస్తూ భయానకమైన పరిస్థితులు సృష్టిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ముస్లిం మైనార్టీల మీద అనేక పద్ధతుల్లో దాడులకు పాల్పడుతూ భయభాంత్రులకు గురిచేస్తోందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పాలకులు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారని, బాధితులపై, వారికి మద్దతు ఇచ్చే వారిపై తప్పుడు కేసులు పెట్టి క్రూరమైన క్లాజుల కింద అరెస్టులు చేసి శిక్షిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్ల రైతు చట్టాల రద్దు కోసం రైతులు ఎలా పోరాటం చేశారో.. ఎన్ఆర్సీ, సీఏఏకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మైనార్టీల హక్కులు కాపాడేందుకు సెక్యూలర్ పార్టీలన్నీ ముందుకు రావాలని కోరారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై, నిర్మల్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కళాం చౌరస్తాలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ చేశారు.