Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉద్యోగుల ధర్నా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తమను ఆదుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఎంప్లాయీస్ జేఏసీ హెచ్చరించింది. జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కోఠిలోని డీఎంహెచ్ఎస్ ప్రాంగణంలో బుధవారం జరిగిన ధర్నాలో ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఆర్.సుజీత్ గాంధీ, టి.శివప్రసాద్ తదితరులు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సంక్షేమాన్ని విస్మరించాయని విమర్శించారు. 2017 నుంచి పే రివిజన్ చేయకుండా కేంద్రం తమకు అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల అమలులో తమ సేవలను వినియోగించుకుంటున్నా...పీఆర్సీ 30 శాతం పెంపును మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని తెలిపారు. ఇదే విషయమై సీఎం కార్యాలయం రిమార్క్స్ కోరినప్పటికీ ప్రాజెక్టు డైరెక్టర్ పంపించకుండా తాత్సారం చేస్తుండటంతో అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి ఎయిడ్స్ నియంత్రణ మండలి ఉద్యోగులకు 20 శాతం, పంజాబ్ ప్రభుత్వం తొమ్మిది శాతం పెంచిందని గుర్తుచేశారు.
సాధారణ బదిలీల కోసం ఉద్యోగులు కోరుతున్నా చేయటం లేదనీ, కొంత మందికి మాత్రం చేస్తూ మెజారిటీ ఉద్యోగులను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. గుర్తింపు కార్డుల జారీ విషయంలోనూ పని చేసే చోట అడిగితే ఎయిడ్స్ సొసైటీ నుంచి తీసుకోవాలనీ, అక్కడ అడిగితే పని చేసే ఆస్పత్రిలో తీసుకోవాలంటూ కొర్రీలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో లాక్డౌన్ సమయాల్లో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. రిస్క్ అలవెన్స్ ఇవ్వాలనీ, ఉద్యోగ భద్రత కల్పించాలనీ, ఇతర రాష్ట్రాలు ఇచ్చినట్టుగా కోవిడ్-19 సమయంలో చేసిన సేవలకు పారితోషికం చెల్లించాలని డిమాండ్ చేశారు. 2020-21లో చేసిన టెస్టుల్లో 6,780 సాధారణ ప్రజలతో పాటు 460 మంది గర్భిణులకు హెచ్ఐవి ఉన్నట్టు తేలిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో మండలి పరిధిలో వివిధ కేడర్లలో 816 మంది హెచ్ఐవీ రోగులకు సేవలతో పాటు ఇతర ఆరోగ్య సేవల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ధర్నాలో జేఏసీ నాయకులు ఎ.రంజిత్ కుమార్, మహమ్మద్ ఫరీదుద్దీన్, మహమ్మద్ రహీం అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
వినతిపత్రం సమర్పణ
ధర్నా అనంతరం జేఏసీ నాయకులు టిసాక్స్ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ అన్నప్రసన్నను కలిసి వినతిపత్రం సమర్పించారు.