Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలేపల్లికి కాలుష్య కా(చే)టు!
- ఫార్మా కంపెనీల నుంచి విషవాయువులు
- చేపల చెరువులు, పంటలపై ప్రభావం
- రోగాలతో మంచం పడుతున్న ప్రజలు
- గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలూ బేఖాతార్
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
పోలేపల్లి సెజ్ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. కంపెనీల లాభార్జన.. పాలకుల స్వార్థ ప్రయోజనాల మధ్య రైతులు నలిగిపోయి.. సిరులు కురిపించే పంట భూములు కోల్పోయి.. కాడి వదిలేసి.. ఆ కంపెనీల వద్దే వాచ్మెన్లు, స్వీపర్లుగా మారారు. ఫార్మా కంపెనీల నుంచి పరిధికి మించి విష వాయువులు వెలువడటంతో ఉన్న కొద్ది భూముల్లోనూ.. పైర్లు మాడిపోతున్నాయి.. చెరువుల్లో చేపలు విలవిల్లాడి నీళ్లపై తేలుతున్నాయి. పర్యావరణ అనుమతుల్లేని 9 కంపెనీలపై గ్రీన్ ట్రిబ్యునల్ కొరఢా ఝలిపించినా.. జరినామా విధించినా.. అవి ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నాయి. లాభార్జనే ధ్యేయంగా రాజకీయ నాయకుల అండదండలతో తమ పని చేసుకుంటున్నాయి. ఈ ఫార్మా కంపెనీల నుంచి వచ్చే విష వాయువుల వల్ల పరిసర తండావాసులు రోగాలతో మంచంపట్టి మరణానికి చేరువౌతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలానికి 8 కిలోమీటర్ల దూరంలో పోలెపల్లి గ్రామం ఉంది. అక్కడ ఔషధ కంపెనీల నిర్మాణం కోసం 1100 ఎకరాలను సెజ్ పేరుతో ప్రభుత్వం సేకరించింది. హెటిరో ఫార్మా, శిల్పా మెడికేర్, అరబిందో ఫార్మా, ఏపీఎల్ హెల్త్‌కేర్, మైదాన్ ల్యాబోరేటరీస్, ఎవర్టోజెన్ లైఫ్ సైన్సెస్ ప్రయివేటు లిమిటెడ్ వంటి కంపెనీలను నెలకొల్పారు. 350 మంది రైతులకు చెందిన సాగు భూములను తక్కువ ధరకు తీసుకున్నారు. ఎకరాకు రూ.18 వేలు నిర్ణయించినా.. దళారులు, రాజకీయ నాయకులు, అధికారుల చేతివాటంతో రైతులకు ఎకరాకు రూ.10 వేలకు మించి అందలేదు. జడ్చర్ల మండలం పోలెపల్లి తండాకు ముడావత్ లక్ష్మి కుటుంబానికి ఆరున్నర ఎకరాల భూమి ఉండేది. సెజ్‌లో భూమి మొత్తం గుంజుకున్నారు. పరిహారం కోసం మూడేండ్లపాటు తిరిగితే.. పరిహారం ఇచ్చారు. అది కూడా ఎకరాకు రూ.18 వేలు నిర్ణయిస్తే.. సర్పంచులు, అధికారులు, పైరవీకారులు రూ.8 వేలు తీసుకొని లకిë కుటుంబానికి రూ.10 వేలే ఇచ్చారు. గతంలో ఆ భూముల్లో వరి, వేరుశనగ, పప్పు శనగ, కంది, ఆముదం, మిర్చి పంటలు పండేవి. ఇప్పుడు భూముల్లేక యువకులు పనుల్లే.. రోడ్లవెంట తిరుగుతున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అదే గ్రామానికి చెందిన రాజేష్ తోడ ఐదు మంది అన్నదమ్ములు. తాతలు సంపాదించిన 12 ఎకరాల భూమి ఉండేది. వీరంతా సాగుమీదనే ఆధారపడి జీవించేవారు. ఆ భూమి మొత్తం సెజ్ పేరుతో తీసుకున్నారు. వారికిప్పుడు ఉపాది లేక వాచ్మెన్లు, స్వీపర్లుగా జడ్చర్ల, మహబూబ్‌నగర్ పట్టణాల్లో బతుకుతున్నారు. భూములు నిరాకరించిన రైతులను భయపెట్టి.. ఉద్యోగాలిస్తామని ఆశ చూపి మోసం చేశారు. తీరా ఇప్పుడా కంపెనీలో రైతులను వాచ్మెన్లు, స్వీపర్లుగా మార్చారు. అదీ మూడేండ్లకోసారి తొలగిస్తూ రోడ్డున పడేస్తున్నారు.
కాలుష్యంతో అనర్థాలు !
ఫార్మా కంపెనీల నుంచి వెలువడే కాలుష్యం వల్ల అక్కడి తండావాసులు రోగాలపాలవుతున్నారు. కంపెనీల నుంచి వచ్చే వర్థ్యాలతో కూడిన నీరు పంట పొలాల్లోకి చేరడంతో పైర్లు మాడిపతున్నాయి. కలుషిత నీరు చెరువుల్లోకి చేరడంతో చేపలు మృత్యువాత పడుతున్నాయి. ప్రధానంగా శిల్పా కంపెనీ నుంచి వచ్చే నీరు చెరువును తలపిస్తోంది. పగటి పూట అయితే ప్రజలు చూస్తారని.. రాత్రిపూట వదులుతున్నారు. దీంతో దుర్గంధం వెదజల్లుతోంది. కాలుష్యం వల్ల స్థానికులు చర్మ వ్యాధులతో పాటు కాన్సర్ వంటి భయానక రోగాల బారిన పడుతున్నారు. యువతీ, యువకుల వెంట్రుకలు తెల్లగా మారడమేగాక యుక్తవయస్సులోనే జుట్టు ఊడి బట్టతల అవుతోంది. బోరు బావుల నుంచి వచ్చే నీరు తాగడం వల్ల వాంతులు, వీరేచనాలు అవుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల నీళ్లు తాగిన పశువులు, గొర్రెలు మృత్యువాత పడుతున్నాయి. బాలానగర్, భూత్పూరు, రాజాపూర్, కొత్తకోట, అలంపూర్ ప్రాంతాల్లోని కంపెనీల పరిధిలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. అధికారులు దృష్టి సారించి కాలుష్యాన్ని నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలి
మహబూబ్‌నగర్ జిల్లాలో అనేక కంపెనీలున్నాయి. కొన్ని కంపెనీలు ప్రజల పట్ల ప్రాణాంతకంగా మారుతున్నాయి. ప్రధానంగా పోలేపల్లి సెజ్‌లో ఉన్న కంపెనీల నుంచి వెలువడే కాలుష్యం వల్ల తండా వాసులు తీవ్ర అస్వస్థతకు గురౌతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలి.
- ఎ.రాములు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, మహబూబ్‌నగర్
మా బతుకులు ఆగమౌతున్నాయి
మాకున్న 8 ఎకరాల్లో 6 ఎకరాలు సెజ్‌లో పోయింది. రెండెకరాలే మిగిలింది. ఎకరాకు రూ.10 వేలకు మించి పరిహారం ఇవ్వలేదు. కంపెనీలో ఉపాది కల్పిస్తామని హామీ ఇచ్చారు. తీరా ఇప్పుడు స్వీపర్లు, వాచ్మెన్లుగా తీసుకున్నారు. అది కూడా మూడేండ్తైతే మమ్మల్ని తొలగించి కొత్తవారిని నియమించుకుంటారు. ఈ కంపెనీల కారణంగా మా బతుకులు ఆగమయ్యాయి.
- లక్ష్మి, పోలేపల్లి తండా, జడ్చర్ల మండలం