Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనవరి 22 నుంచి 25వరకు సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలు
- తొలిరోజు ఇబ్రహీంపట్నంలో బహిరంగ సభ ొ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై సమగ్ర చర్చ ొ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లే విషయంపై కేసీఆర్ స్పందనేది?
- ధాన్యంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి : మహాసభల లోగో ఆవిష్కరణలో తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భవిష్యత్ ప్రజా పోరాటాలకు మహాసభలు దిశా నిర్దేశం చేయనున్నాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సీపీఐ(ఎం) రాష్ట్ర మూడో మహాసభలను రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్, ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో జనవరి 22నుంచి 25వరకు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. 22 సాయంత్రం ఇబ్రహీంపట్నంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ప్రతి పక్ష పార్టీలు పోరాడాల్సిన తరుణంలో జరుగుతున్న మహాసభలకు రాజకీయ ప్రాధాన్యత ఉందని అన్నారు. నాలుగు రోజుల పాటు జరిగే సభల్లో ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చిస్తామన్నారు. హైదరాబాద్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ.. వామపక్షాల ఉద్యమం, ఐక్యతకు ఈ మహాసభలు దోహద పడ్తాయని ఆకాంక్షించారు. విద్యుత్ ఖర్చులు భారంగా మారాయనే ముసుగులో కరెంటు చార్జీలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తున్నదని తమ్మినేని పేర్కొన్నారు. ప్రజలపై భారం పడకుండా సర్దుబాటు చేసుకోవాలనీ, లేకుంటే ప్రజాఉద్యమాలు చేయాల్సి వస్తున్నదని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సమస్య రాష్ట్ర ప్రభుత్వాలనే తలకిందులు చేసిందని తమ్మినేని గుర్తుచేశారు. మహాసభల ఉద్దేశాలను రాష్ట్రంలోని ప్రతి పల్లెకు తీసుకెళ్లాలని పార్టీ క్యాడర్‌కు ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు పరాకాష్టకు చేరాయని తమ్మినేని విమర్శించారు. పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలను టోకుగా కాటా పెట్టి ప్రయివేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వాలు ఆస్తులు అమ్మేవనీ, మోడీ ప్రభుత్వం అమ్మకంతోపాటు లీజుకుకూడా ఇస్తుందని..దీని వల్ల అందుబాటులో ఉన్న సేవలను ప్రజలు కోల్పోతున్నారని చెప్పారు. ఆత్మనిర్భరత నినాదమిచ్చిన మోడీ స్వయం సమృద్ధికి తిలోదకాలిచ్చి దేశాన్ని పరాధీనంలోకి మారుస్తున్నారని అన్నారు. దీని వల్ల నిరుద్యోగ సమస్య తీవ్రమైందనీ, మతకలహాలు, ఫాసిస్టు ధోరణులు పెరిగిపోతున్నాయని తమ్మినేని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిపై రాజద్రోహం కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని చెప్పారు. కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తున్నదనీ, విద్యా, వైద్యం, వ్యవసాయంపై రాష్ట్రాల అజమాయిషీని కూడా కేంద్రం తన చేతుల్లోకి తీసుకుందని విమర్శించారు. వ్యవసాయ నల్ల చట్టాలు రూపకల్పన అందులో భాగమేనని పేర్కొన్నారు. బీజేపీ విధానాలను వ్యతిరేకించటంలో టీఆర్ఎస్ ఘోరంగా విఫలమయిందని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యమైందని అన్నారు. అప్పుడప్పుడు బీజేపీ విధానాలను వ్యతిరేకించటం, తర్వాత మెతక ధోరణి అవలంభించటం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అలవాటుగా మారిందని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో తాడో పేడో తేల్చుకుంటానని ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ ఉత్తచేతులతో తిరిగొచ్చారని అన్నారు.కేసీఆర్‌కు మోడీ అపాయింట్మెంట్ ఇచ్చారా లేదా..? అనే విషయంలో ఇప్పటి వరకు అధికారికంగా సమాచారం లేదని అన్నారు. బీజేపీ వైఫల్యం తేలిపోయిందని అంటున్నారే తప్ప.. గతంలో ప్రకటించినట్టుగా ఢిల్లీలో ధర్నా, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లే విషయాలపై కేసీఆర్ ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. వడ్ల కొనుగోలుకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు బీజేపీ-టీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధంగా కనిపిస్తుంది కానీ..రైతులకు ఒరిగిందేమీ లేదనీ తమ్మినేని వ్యాఖ్యానించారు. రైతాంగ సమస్యలపై వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ బాధ్యులతో కలిసి ఆయన మహాసభల లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి వెంకట్, టి జ్యోతి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్‌తో పాటు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాల్గొన్నారు.
పార్టీ మహాసభలకు సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పోలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్కరత్, బీవీ రాఘవులు హాజరవుతారని తమ్మినేని తెలిపారు. 22న బహిరంగ సభతో మహాసభలు ప్రారంభమవుతాయి. తర్వాత మూడు రోజులు ప్రతినిధుల సభ జరుగుతుంది. అన్ని జిల్లాలనుంచి సుమారు 700మంది ప్రతనిధులు హాజరవుతారు. సభల నిర్వాహణకు 300 మంది వాలంటీర్లు సేవలందిస్తారని ఆయన వివరించారు. ఆహ్వాన సంఘం ఇప్పటికే మహాసభ ఏర్పాట్లలో నిమగమై ఉందన్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులు చెరుపల్లి సీతారాములు, ఉపాద్యక్షులు పగడాల యాదయ్య, ప్రధాన కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ , కోశాధికారి బోడ సామేలు పర్యవేక్షణలో 13 సభల నిర్వాహణ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే గోడరాతలు, సాంస్కృతిక కళారూపాల శిక్షణ, ఇంటింటి ప్రచారం తదితర రూపాల్లో మహాసభ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.