Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్లో ఇటీవల జరిగిన సీఐటీయూ జనరల్ కౌన్సిల్ సమావేశాలు భవిష్యత్ ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తాయని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశాల విజయవంతానికి కృషి చేసిన, సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. కౌన్సిల్ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్లోని ఎస్వీకేలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైవిధ్యంతో ఏర్పాటు చేసిన ఆహ్వాన సంఘం కూర్పు, కౌన్సిల్ నిర్వహణ కోసం వేసిన 20 సబ్కమిటీలు సమన్వయంతో పనిచేయడం వల్లనే ఆ సమావేశాలు విజయవంతమయ్యాయని చెప్పారు. ఒక ఆలోచన ప్రజల్లో వచ్చి భౌతికంగా ఆవరిస్తే రాజ్యం వారికి తలొగ్గాల్సిందేనని ఢిల్లీ రైతు ఉద్యమం చూపెట్టిందన్నారు. రైతులు, కార్మికులు సంఘటితంగా దేశంలో ఐక్యంగా పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ..ఢిల్లీ రైతాంగ పోరాటానికి సీఐటీయూ అందించిన సహకారం మరువలేనిదన్నారు. కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీల ఐక్యతకు చిహ్నంగా రైతు ఉద్యమం నిలిచిందన్నారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమాన్ని కులం, ప్రాంతం, వర్గం పేరుతో మోడీ సర్కారు విచ్ఛిన్నం చేయాలని చూస్తే..అది మరింత బలోపేతమైందన్నారు. కార్మికులు, రైతులు కలిసి ఐక్యపోరాటం దిశగా వెళ్తున్నారని గ్రహించే మోడీ సర్కారు వెనక్కి తగ్గిందన్నారు. అయితే, విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేసేవరకూ, పంటలకు కనీస మద్దతు ధరల చట్టం తెచ్చేవరకూ పోరాటం సాగుతుందని తేల్చిచెప్పారు. ఫిబ్రవరిలో కార్మికులు తలపెట్టిన రెండు రోజుల సమ్మెకు రైతు సంఘాలు కూడా మద్దతు తెలుపబోతున్నాయని చెప్పారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది టి.విద్యాసాగర్ మాట్లాడుతూ..దేశంలో తమ పక్షం నిలిచి పోరాటం చేయగలిగే సత్తా సీఐటీయూకే ఉందని ప్రజలు గుర్తించి సహకరిస్తున్నారని చెప్పారు. ప్రజా ఉద్యమాలకు సీఐటీయూ సారధ్యం వహిచాలని ఆకాంక్షించారు. బాగ్లింగంపల్లి ఎస్వీకే ట్రస్టు కార్యదర్శి ఎస్.వినయకుమార్ మాట్లాడుతూ... రైతుల పోరాటంతో మోడీ సర్కారు రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకున్నదనీ, ఆ పోరాటం కార్మిక సంఘాల్లోనూ ఉత్తేజాన్ని నింపిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కాన్షడరేషన్ అధ్యక్షులు నాగేశ్వర్ మాట్లాడుతూ..ఐక్య ఉద్యమాల్లో సీఐటీయూ చోదకశక్తిగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో సీఐటీయూ జనరల్ కౌన్సిల్ ఆహ్వాన కమిటీ ప్రధాన కార్యదర్శి జె.వెంకటేశ్, కోశాధికారి నాగేశ్వర్రావు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్, సోషల్మీడియా విభాగ బాధ్యులు జగదీశ్, తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.