Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17 జిల్లాల్లో తగ్గుదల..16 జిల్లాల్లో పెరుగుదల
- సాధారణం కంటే 31 శాతం అధిక వర్షపాతం నమోదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో గతేడాది నవంబర్ మాసంతో పోలిస్తే ఈ నవంబర్లో భూగర్భ జలాల మట్టాలు స్వల్పంగా అడుగంటాయి. భూగర్భ జల శాఖ 33 జిల్లాల్లో 1, 115 పరిశీలక బావుల ద్వారా వివరాలు సేకరించి విశ్లేషణ జరుపగా ఇది తేలింది. ఈ ఏడాది రాష్ట్రంలో నవంబర్ వరకు 841 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కురువాల్సి ఉంది. దీనికిగానూ, రాష్ట్రంలో 1, 101 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనిని బట్టి చూస్తే రాష్ట్రంలో 31 శాతం అధికంగా వర్షపాతం రికార్డయింది. ఖమ్మం, భూపాలపల్లి, మెదక్, వనపర్తి, హైదరాబాద్, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజిగిరి, నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, మహబూబ్నగర్, జనగాం, నిర్మల్, జగిత్యాల, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, నారాయణపేట, హనుమకొండ, సిద్ధిపేట, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా నమోదైంది. రాష్ట్రంలో నవంబర్-2020 తో పోలిస్తే సగటున 0.02 మీటర్ల లోతునకు భూగర్భజలాల మట్టాలు పడిపోయాయి. 16 జిల్లాల్లో పెరిగాయి. 17 జిల్లాల్లో అడుగంటాయి.
గతేడాదితో పోలిస్తే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 1.82 మీటర్ల లోతునకు పడిపోయాయి. కరీంనగర్ జిల్లాలో 3.37 మీటర్ల మేర భూగర్భజలాల మట్టాలు పెరిగాయి. పదేండ్ల నవంబర్ మాసం భూగర్భ జలాల మట్టాల సరాసరితో పోలిస్తే మొత్తం 594 మండలాలకుగానూ 573 మండలాల్లో పెరుగుదల కనిపించింది. 21 మండలాల్లో తగ్గింది. 0.5 మీటర్ల లోతులో నీళ్లు లభించే మండలాలు 30 ఉన్నాయి. 0.5 నుంచి ఒక మీటర్ పరిధిలో 38 మండలాలు, ఒకటి నుంచి రెండు మీటర్ల పరిధిలో 94 మండలాలు, రెండు మీటర్ల కంటే ఎక్కువ లోతులో ఉన్న మండలాలు 411 ఉన్నాయి.