Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూర్తి పరిహారం ఇచ్చాకే పనులు చేపట్టాలి
- భూనిర్వాసితుల వేడుకోలు
నవతెలంగాణ-తొగుట
పూర్తి పరిహారం ఇచ్చిన తర్వాతే అదనపు కెనాల్ పనులు చేపట్టాలని.. కెనాల్ నిర్మాణ పనులను భూనిర్వాసితులు అడ్డుకున్నారు. పరిహారం సగమే ఇచ్చారనీ, ఆరునెలలవుతున్నా మిగిలిన పరిహారం ఇవ్వట్లేదని విమర్శించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఘనపూర్, ఎల్లారెడ్డిపేట్ గ్రామాల శివారులో గల భూముల్లో నుంచి మల్లన్నసాగర్ ప్రాజెక్టులోకి అదనపు టీఎంసీ నీటిని తరలించేందుకు ఓపెన్ కెనాల్ నిర్మాణం చేపడుతున్నారు. కాగా, భూసేకరణ సమయంలో ఎకరం భూమికి రూ.13 లక్షలు ఇస్తామని నిర్వాసితులతో ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించారు. కాగా, అధికారులు రూ.8 లక్షలు మాత్రమే ఇచ్చారని భూ నిర్వాసితులు తెలిపారు. ఒప్పందం చేసుకుని దాదాపు 6 నెలలవుతున్నా మిగతా రూ.5 లక్షలు ఇవ్వడం లేదని వాపోయారు. బోర్లు, బావులు, చెట్లు, స్ట్రక్చర్ పరిహారాలు ఇవ్వకుండా పనులు చేస్తుండటంతో రైతులు మరింత ఆవేదనకు గురయ్యారు. వెంటనే తమకు రావాల్సిన రూ.5 లక్షల నష్టపరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పనులను అడ్డుకున్నారు. కాంట్రాక్టర్లు చేసేదేమీ లేక పనులు నిలిపివేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు సంఘీభావం తెలిపారు. రైతుల పక్షాన ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడగా.. వారు స్పందిస్తూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనులు మాత్రమే చేయాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. ఈ పనులకు తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్టు చెరుకు తెలిపారు. రైతులకు వెంటనే మిగతా రూ. 5 లక్షలు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ జిల్లా నాయకులు, రైతులు పాల్గొన్నారు.