Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి కల్పనలో బీజేపీ సర్కారు విఫలం
- జనవరి 7 నుంచి హైదరాబాద్లో ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్లడానికి ప్రధాన అడ్డంకి నిరుద్యోగమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గురువారం హైదరాబాద్లోని మఖ్దూం భవన్లో అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) 16వ జాతీయ మహాసభల గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతరేక, తిరోగమన విధానాల వల్ల దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతున్నదని చెప్పారు. లక్షలాది కుటుంబాలు ఉపాధి అవకాశాల కొరతతో ఆందోళన చెందుతున్నాయని అన్నారు. దేశ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్మార్ట్ సిటీ నినాదాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు అమ్ముకుని శాశ్వత ఉద్యోగాలు లేకుండా చేస్తున్నదని విమర్శించారు. లేబర్ కోడ్లు తెచ్చి కార్మికుల వేతనాలు, ఉపాధి స్థిరత్వం, సామాజిక భద్రతను దెబ్బతీస్తుందని అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోడీ ఏడేండ్లలో రెండు వేల ఉద్యోగాలనూ భర్తీ చేయలేదని ఎద్దేవా చేశారు. రాజకీయ కుట్రలు, నిందలు మాని 'యుద్ధ ప్రాతిపదికన' ఉపాధి అవకాశాల కల్పనకు కషి చేయాలని ప్రధానిని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కనీసం నిరుద్యోగ భృతిని అమలు చేయడం లేదన్నారు. యువత నడుం బిగిస్తే దేశ భవిష్యత్ మారుతుందని చెప్పారు. వచ్చేనెల 7 నుంచి 10 వరకు హైదరాబాద్లో జరగనున్న ఏఐవైఎఫ్ 16వ జాతీయ మహాసభలు విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ 16వ జాతీయ మహాసభల ఆహ్వాన కమిటీ అధ్యక్షులు, సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటి నరసింహ, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు వలీ ఉల్లా ఖాద్రి, అనిల్ కుమార్ మారుపాక, ఏఐఎస్ఎఫ్ జాతీయ నాయకులు బి స్టాలిన్, ఏఐటీయూసీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కమతం యాదగిరి, ఏఐవైఎఫ్ నాయకులు నిర్లేకంటి శ్రీకాంత్, టి సత్య ప్రసాద్, కె ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.