Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధితురాలి కుటుంబ సభ్యుల దేహశుద్ధి
- పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు
నవతెలంగాణ-నారాయణఖేడ్
వైద్యుడి లైంగిక వేధింపులు తాళలేక ఓ ట్రైనింగ్ ఏఎన్ఎం.. తన కుటుంబ సభ్యులు, బంధువులకు తెలపడంతో వారు ఆ వైద్యుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కల్హేర్ మండలం బాచేపల్లి గ్రామం నాగని కుంట తండాకు చెందిన సునీత నర్సింగ్ కోర్సు పూర్తిచేసి పదిరోజుల కిందట ఖేడ్ ప్రభుత్వాస్పత్రిలో అప్రెంటీస్ ట్రైనింగ్ కోసం జాయినైంది. ఈ క్రమంలోనే సునీత ఆస్పత్రిలో విధులకు సక్రమంగా రాకపోవడంతో పాటు సర్టిఫికెట్ కోసం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింగ్ చౌహాన్ వద్దకు వెళ్లింది. ఆమె అవసరాన్ని ఆసరా చేసుకున్న వైద్యుడు అసభ్యకరమైన పదజాలంతో.. నాకు ఏమిస్తావు.. అని అడిగాడు. అంతేకాక ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. దాంతో ఏఎన్ఎం సునీత ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు, బంధువులకు తెలపగా వారు గురువారం ఆస్పత్రికి వెళ్లి వైద్యుడిపై దాడి చేశారు. అనంతరం నారాయణఖేడ్ పోలీస్‌స్టేషన్‌లో డాక్టర్ మాణిక్ చౌహన్‌పై ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు వైద్యుడిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ వైద్యుడి తీరుపై గతంలోనూ ఆరోపణలున్నాయి. అదేవిధంగా సర్టిఫికెట్ల కోసం వచ్చే నర్సింగ్ విద్యార్థుల నుంచి లంచాలు తీసుకుంటున్నట్టు ఇటీవల జరిగిన ఆస్పత్రి ఆకస్మిక తనిఖీలో పలువురు ఆ డాక్టర్‌పై ఫిర్యాదు చేశారు. ఇలాంటి వైద్యుడిని వెంటనే సస్పెండ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.