Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నీట్-పీజీ-2021 కౌన్సిలింగ్ జాప్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం నుంచి ప్రభుత్వాస్పత్రుల్లో అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని సేవలనూ బహిష్కరిస్తున్నట్టు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు గురువారం అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ సాగర్, డాక్టర్ కార్తీక్, జాయింట్ ప్రెసిడెంట్ డాక్టర్ వివేక్ రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ రమేశ్ రెడ్డికి లేఖ అందజేశారు. దేశవ్యాప్తంగా ఫైమా, ఫోర్డా, ఆయా రాష్ట్రాల్లో రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్లు నీట్-పీజీ కౌన్సిలింగ్ జాప్యానికి నిరసనగా చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలో నిర్వహించాల్సిన పరీక్షను కోవిడ్ పేరుతో రెండు సార్లువాయిదా వేశారనీ, దీంతో మార్చిలో జాయిన్ కావాల్సిన పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు వచ్చే ఏడాది జనవరికి కూడా చేరలేని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపథ్యంలో డాక్టర్లను సన్నద్ధం చేయాల్సి ఉండగా, ఈ జాప్యం మరింత ఇబ్బందుల్లోకి నెడుతుందని విమర్శించారు. సుప్రీంకోర్టులో ఉన్న కేసును ఫాస్ట్ ట్రాక్ ద్వారా విచారించి తేల్చాలని విజ్ఞప్తి చేశారు.