Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బావిలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో.. గజ ఈతగాడు మృతదేహం వెలికితీత
- మృతుని కుటుంబీకులు, గ్రామస్తుల ధర్నా
- ఆర్డీఓ హామీతో విరమణ
నవతెలంగాణ-దుబ్బాక రూరల్
బావిలోకి దూసుకెళ్లిన కారు ఘటనలో.. కారుకు క్రేన్ తాడు బిగించబోయి కారుకు ఇరుక్కుపోయి మృతిచెందిన గజ ఈతగాడు మృతదేహాన్ని గురువారం వెలికితీశారు. వేగంగా వెళ్తున్న కారుకు.. ఒక్కసారిగా టైరు పగిలిపోవడంతో రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో తల్లి, కొడుకులు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ సమీపంలో బుధవారం జరిగిన విషయం విధితమే. కాగా వారి మృతదేహాలను వెలికితీసేం దుకు ప్రయత్నిస్తుండగా.. ప్రమాదవశాత్తు కారుకు కట్టిన తాడు బిగుసుకుపోయి ఎనగుర్తి గ్రామానికి చెందిన గజ ఈతగాడు నర్సింలు కూడా మృతిచెందాడు. అయితే కారును పైకి లాగే ప్రయత్నంలో అతని మృతదేహం నీటిలో పడిపోయింది. బుధవారం రాత్రి కారును బయటికి తీసి.. తల్లి, కొడుకుల మృతదేహాలను వెలికితీశారు. అయితే అప్పటికే రాత్రి అవ్వడం, బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో నర్సింలు మృతదేహాన్ని బుధవారం బయటికి తీయలేకపోయారు. గురువారం ఉదయం నర్సింలు మృతదేహాన్ని బయటికి తీశారు. మృతునికి భార్య లత, కూతురు, కుమారుడు ఉన్నారు.
చిట్టాపూర్‌లో ఉద్రిక్తత వాతావరణం..
నర్సింలు మృతదేహాన్ని బయటకు తీసి వాహనంలో తరలిస్తుండగా.. మృతుని కుటుంబీకులు, బంధువులు అడ్డుకున్నారు. దాంతో చిట్టాపూర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతదేహాన్ని మరో వాహనంలోకి మార్చడంతో ఆ వాహనం చుట్టూ కుటుంబీకులు, గ్రామస్తులు గుమిగూడి ధర్నాకు దిగారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో ఆర్డీఓతో ఎనగుర్తి సర్పంచ్ శంకర్ ఫోన్లో మాట్లాడారు. కాగా, మృతుని కుటుంబానికి వారం రోజుల లోపు రూ.6లక్షలు, నెల తర్వాత మరో రూ.5 లక్షలు, డబుల్ బెడ్రూం ఇల్లు, కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం, మృతుని ఇద్దరి పిల్లల పేరు మీద తలో రూ.2.50లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చినట్టు సర్పంచ్ తెలిపారు. దాంతో వారు ఆందోళన విరమించారు. ఆందోళనతో సిద్దిపేట నుంచి రామాయంపేట్, మెదక్ వెళ్లడానికి చిట్టాపూర్ ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచింది. హబ్సిపూర్ వద్ద బారికేడ్లు మోహరించి. దుబ్బాక నుంచి భూంపల్లి మీదుగా వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. నిరసన చేస్తున్నవారికి కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి మద్దతు తెలిపారు. మృతుని కుటుంబాన్ని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోలిపేట సతీష్‌కుమార్ పరామర్శించారు.