Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాసంగి వడ్లపై రంగంలోకి రైస్ మిల్లర్లు
- క్వింటాల్ బాయిల్డ్ బియ్యానికి ధర రూ.2600
- క్వింటా ధాన్యానికి రూ.1400కు కొంటామని రైతులకు సంకేతాలు
- ఆయా జిల్లాల్లో రైతులతో సమావేశమై ఒప్పందాలు
- ఎంతోకొంతకు అమ్ముకునేందుకు సిద్ధమవుతున్న అన్నదాతలు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వ చర్యలతో యాసంగి వడ్లు కొనబోమని, కొనుగోలు కేంద్రాలూ ఉండవని రాష్ట్ర సర్కారు తేల్చడంతో చి'వరి'కి మిల్లర్లే దిక్కయ్యారు. సర్కారు కొనకున్నా.. ఎఫ్‌సీఐ తీసుకోకున్నా అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకునేందుకు తాము ధాన్యం కొంటామని మిల్లర్లు ముందుకొస్తున్నారు. అయితే క్వింటా ధాన్యానికి సర్కారు ఇచ్చిన రూ.1940 ధరకు బదులు రూ.1400 మించి ఇవ్వలేమని ముందస్తుగానే సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పటికే ఆరుతడి పంటల గడువు ముగియడం, ఉన్న ఈ సమయంలో వరి తప్ప వేరే ఏ పంటకూ అవకాశం లేకపోవడంతో రైతులు వరి సాగుకే సిద్ధమవుతున్నారు.
ప్రతియేటా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూగర్భజల మట్టం 2.15 మీటర్ల కనిష్ట స్థాయిలో ఉంది. మధ్యమానేరు, దిగువమానేరు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు సహా ఎస్సారెస్సీ కూడా నిండుకుండలా ఉంది. 1560 చెరువులూ అలుగు దూకాయి. చుట్టూ పుష్కలమైన నీరు ఉండటం, ప్రతియేటా సర్కారే ధాన్యాన్ని కొనడం మూలంగా రైతులు ఏయేటికాయేడు వరి సాగువైపే మొగ్గుచూపారు. ఐదేండ్ల కిందటి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3లక్షల ఎకరాలు దాటని యాసంగి వరి సాగు గతేడాది ఏకంగా 10లక్షల ఎకరాలకు పెరిగింది. ధాన్యం దిగుబడి కూడా 18లక్షల మెట్రిక్ టన్నుల వరకు వచ్చింది. అయితే, యాసంగిలో వచ్చే బాయిల్డ్ రైస్ తీసుకోబోమని ఎఫ్‌సీఐ స్పష్టం చేయడంతో తాము కొనబోమని, కొనుగోలు కేంద్రాలూ పెట్టబోమని రాష్ట్ర సర్కారు చేతులెత్తేసింది.
ముగిసిన ఆరుతడి పంటల గడువు
ఆరుతడిపై అన్నదాతలు దృష్టిసారించేలా ప్రభుత్వం కొన్ని ప్రత్యామ్నాయ పంటల జాబితా విడుదల చేసింది. అయితే, ఆ పంటల సాగు గడువు ఇప్పటికే ముగిసింది. ఆ పంటలు వేసుకోవాలంటే మళ్లీ జవనరి చివరి వారం వరకు ఆగాల్సి ఉండటం వంటి పరిణామాల మధ్య రైతులు వరి సాగు చేసేందుకే సిద్ధమవుతున్నారు. వ్యవసాయాధికారుల తాజా అంచనా ప్రకారం.. కరీంనగర్ జిల్లాలో కలిపి 2.13లక్షల ఎకరాల్లో సాగవుతుండగా.. 1.79లక్షల ఎకరాల్లో వరి పంట వేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో అన్ని పంటలూ కలిపి 1.58లక్షల ఎకరాల్లో సాగవుతుండగా.. వరి 1.46లక్షల ఎకరాల్లో సాగు చేయబోతున్నారు. జగిత్యాల జిల్లాలో అన్ని పంటలూ కలిపి 2.46లక్షల ఎకరాల్లో సాగువుతుండగా.. అందులో వరి 1.87లక్షల ఎకరాల్లో వేయనున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో అన్ని పంటలూ కలిపి లక్ష ఎకరాల్లో సాగవుతుండగా.. అందులో వరి 8వేల ఎకరాల్లో సాగవనుంది.
రంగంలోకి మిల్లర్లు..
ఏడాదిలో ఆర్నెళ్లు మాత్రమే నడిచే రైస్‌మిల్ ఇండిస్టీకి యాసంగిలో వరి వేయకుంటే మూతపడే ప్రమాదం పొంచి ఉంది. యాసంగి వడ్లను కొనబోమని సర్కారు, బాయిల్డ్ రైస్ తీసుకోబోమని ఎఫ్‌సీఐ రెండూ తేల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లో అయినా అమ్ముకుని వ్యాపారం చేసేందుకు మిల్లర్లు సిద్ధమవుతున్నారు. ఆయా జిల్లాల రైతులతో మిల్లర్లు సమావేశమవుతున్నారు. కరీంనగర్ జిల్లాలో ఈ యాసంగిలో సాగయ్యే 1.70లక్షల ఎకరాల వరిలో 70వేల ఎకరాల పంటను విత్తన సంస్థలే కొంటున్నాయి. మిగిలిన లక్ష ఎకరాల పంటను కొంటామని మిల్లర్లు చెబుతున్నారు. ఇలా ఒక్కో జిల్లాలో సుమారు లక్ష ఎకరాల చొప్పున పంటను కొంటామని హామీ ఇస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 670 రైస్‌మిల్లుల్లో 350 వరకు పారాబాయిల్డ్ రైస్‌మిల్లులు ఉన్నాయి. అందులో మూడేండ్ల కాలంలోనే 70 కొత్త మిల్లులు ఏర్పడ్డాయి. యాసంగిలో ధాన్యం బాయిల్డ్ చేస్తే వచ్చే బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ ఉంది. అయితే కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల్లో బాయిల్డ్ రైస్ టన్నుకు రూ.347 డాలర్లు మాత్రమే పలుకుతోంది. ప్రస్తుతం దేశ కరెన్సీ విలువ డాలర్‌కు రూ.74.99 పలుకుతోంది. ఈ లెక్కన టన్నుకు రూ.26021 వస్తుండగా.. క్వింటాల్ బియ్యానికి రూ.2602 మాత్రమే వస్తోంది. దీంతో మొన్నటివరకు గ్రేడ్ 'ఏ' రకం ధాన్యం క్వింటాల్‌కు ప్రభుత్వం చెల్లించిన రూ.1940కి బదులు రూ.1400 మించి ఇవ్వలేమని ముందస్తుగానే రైతులను మానసికంగా సిద్ధం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వరి తప్ప వేరే పంట వేయలేని రైతులు ఎంతో కొంతకైనా పంటను అమ్ముకునేందుకు యాసంగి వరి సాగుకు సిద్ధమవుతున్నారు.