Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాలి
- 15 రోజుల పాటు వివిధ రూపాల్లో ఉద్యమం
- అప్పటికీ పరిష్కరించకుంటే.. సమ్మెకు సిద్ధం : టీయూఎంహెచ్‌ఇయూ ధర్నాలో నర్సుల హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా సమయంలో ఆస్పత్రుల్లో సేవలందించాల్సిన ఆ నర్సులు ధర్నాచౌక్ బాట పట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని మరోసారి నినదించారు. ప్లకార్డులు చేతబూని సర్కారు నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. దశాబ్దాలుగా చేస్తున్న సేవలను క్రమబద్దీకరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి పాలన పోయి ప్రత్యేక రాష్ట్రమొస్తే తమ బతుకులు బాగుపడతాయని పోరాడితే మరింత అధ్వాన్నంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో తమ పనికి సంబంధించి రాత్రింబవళ్లు అధికారులకు సమాధానం చెప్పుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వైద్యా రోగ్యశాఖలో పనులు చెప్పే అధికారుల సంఖ్య ఎక్కువగా ఉంది కాని సమస్యలను పరిష్కరించే వారే కనిపించటం లేదని విమర్శించారు. అధికార పార్టీకి తొత్తులుగా మారిన కొంత మంది పోరాటాలవసరం లేదంటూ చెబుతున్నారని వారు విమర్శించారు. ఇప్పటికే హక్కులను కోల్పోయిన ఏఎన్ఎంలను యూనియన్ల పేరుతో చీల్చి ఉద్యమాన్ని బలహీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారనీ, అలాంటి వారి పట్ల ప్రతీ ఏఎన్ఎం అప్రమత్తంగా ఉండాలని కోరారు. గతంలో సాధించుకున్న ఫలితాలు పోరాటాల ద్వారానే వచ్చాయని గుర్తుచేశారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయుఎంహెచ్‌ఇయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్ అధ్యక్షతన గురువారం హైదరాబాద్‌లోని ధర్నాచౌక్ వద్ద నర్సులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భూపాల్‌తో పాటు యాదానాయక్ తదితరులు మాట్లాడుతూ వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఎంపీహెచ్ఏ (ఫిమేల్)లందరిని పర్మినెంట్ చేయాలనీ, కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు బేసిక్ పే రూ.31,040కు పెంచాలనీ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి-సమాన వేతనం ఇస్తూ టిఎ, డిఎ, ఎఫ్ టిఎ, ఇతర అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పని భారం తగ్గించేందుకు ఖాళీలను వెంటనే భర్తీ చేయాలనీ, పనిని టీమ్ వర్క్‌గా చేసేందుకు ప్రోత్సహించాలని సూచించారు. కోవిడ్ వ్యాక్సిన్ రవాణా బాధ్యతలను జిల్లా అధికారి, మెడికల్ ఆఫీసర్‌కు అప్పగించాలని కోరారు. ఒకే రోజు చిన్నపిల్లల వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్ వేయాల్సి వస్తే పొరపాట్లు జరిగే అవకాశముందనీ, బుధ, శనివారాలు పిల్లల వ్యాక్సినేషన్ మాత్రమే చేసేలా అధికారులు ప్రతిపాదనలు పంపించాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ పనికి అయ్యే ఇంటర్ నెట్ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలనీ, ఇందుకోసం ప్రతి ఒక్కరికి రూ.500 చెల్లించాలనీ, స్టాఫ్ నర్సులు సెలవు పెట్టినప్పుడు ఏఎన్ఎంలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డ్యూటీ వేయొద్దనీ, రెగ్యులర్ ఉద్యోగులతో పాటు వారికి కూడా సెలవు తీసుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం రాబోయే 15 రోజుల పాటు వివిధ రూపాల్లో ఉద్యమం కొనసాగుతుందనీ, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పిస్తామని తెలిపారు.
అప్పటికీ ప్రభుత్వానికి సోయి రాకుంటే వ్యాక్సినేషన్‌తో పాటు విధులను బహిష్కరిస్తామని తెలిపారు. సమ్మె తదితర రూపాల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో యూనియన్ రాష్ట్ర కోశాధికారి ఫసియొద్దీన్, రాష్ట్ర కార్యదర్శులు జె.సుధాకర్, కవిత, విజయవర్థన్ రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు కుమారస్వామి, నవీన్, కిరణ్మయి, లక్ష్మీబాయి, విజయలక్ష్మి, సరోజ, మీన, సుగుణ, స్టెల్జా తదితరులు ప్రసంగించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ఏఎన్ఎంలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.