Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెల్ఫేర్ బోర్డు నిధులు.. కార్మిక సంక్షేమానికే..
- భవన నిర్మాణం సరుకుల ధరలు తగ్గించాలి
- కార్మికుల సమస్యలను పరిష్కరించాలి : బిల్డింగ్ & అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రాములు, కోటం రాజు
- రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా, ర్యాలీలు
నవతెలంగాణ- విలేకరులు
''కార్మికుల హక్కులను హరించే కార్మిక కోడ్లను తక్షణం రద్దు చేయాలి.. కోడ్స్ వల్ల భవన నిర్మాణ రంగ కార్మికుల వెల్ఫేర్ బోర్డులు, బోర్డులో పరిధిలో నిధులు, సంక్షేమ పథకాలు వంటి బెనిఫిట్స్ లేకుండా పోతాయి.. ఇప్పటికే కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన వెల్ఫేర్ బోర్డు నిధులను దారి మళ్లించారు.. వాటిని వెంటనే వెనక్కి ఇవ్వాలి'' అని బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వంగూరు రాములు, కోటం రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం రాష్ట్రంలోనూ ధర్నాలు చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. హైదరాబాద్ ఆర్డీవో ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించి, ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వంగూరు రాములు మాట్లాడుతూ.. 1996 కేంద్ర చట్టం, 1979 వలస కార్మికుల చట్టాల రద్దును ఉపసంహరించుకొని, వాటిని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. పెరిగిన నిర్మాణ మెటీరియల్ ధరలను తగ్గించాలని, పెండింగ్ క్లెయిమ్స్‌ను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు నిధులను కార్మిక సంక్షేమం కోసం మాత్రమే ఖర్చు చేయాలన్నారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ సర్కారు చట్టాలను నిర్వీర్యం చేస్తోందన్నారు. కార్మిక చట్టాలను కోడ్స్‌గా మార్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని నియమించకుండా, బోర్డు నుంచి రూ.1,005 కోట్ల నిధులను అక్రమంగా దారి మళ్లించి, కార్మికుల నోట్లో మట్టి కొట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36,000 క్లైమ్స్‌కు నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు.
భవన నిర్మాణ రంగ కార్మికుల చట్టాలను పునరుద్ధరించాలి: జూలకంటి
భవన నిర్మాణ రంగ కార్మికుల చట్టాలను పునరుద్ధరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. మిర్యాలగూడ పట్టణంలోని లేబర్ అడ్డా వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణ రంగంలో వాడే ముడిసరుకుల ధరలు తగ్గించాలన్నారు. కరోనాతో పనులు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న నిర్మాణ రంగ కార్మికులను ఆదుకోవాలని కోరారు. వారికి వెల్ఫేర్ బోర్డ్ నిధుల నుండి ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కోటంరాజు మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న కార్మికచట్టాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సవరిస్తోందన్నారు. ఇప్పటికే లాక్డౌన్ వల్ల ఏడాది పాటు కార్మికులకు పని లేకుండా పోయిందన్నారు. ఇలాంటి తరుణంలో కార్మికులను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
నల్లగొండలో భవన నిర్మాణ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా, ర్యాలీ నిర్వహించారు. నాంపల్లిలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి తహసీల్దార్ ఖాజా మైనుద్దిన్కు వినతిపత్రం అందజేశారు. కల్వకుర్తి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి.. తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
ఖమ్మం రూరల్ మండలం తహసీల్దార్ కారుమంచి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. బోనకల్లో ముందుగా బస్టాండ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకొని ధర్నా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేశారు. నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేవారు.