Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతుల రాస్తారోకో
నవతెలంగాణ-లింగంపేట్
ధాన్యం సకాలంలో కొనుగోలు చేయాలనీ, తూకం వేసిన ధాన్యాన్ని వెనువెంటనే రైస్ మిల్లులకు తరలించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రధాన రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులతో కలిసి గురువారం రెండు గంటలపాటు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ.. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి రెండు నెలలు సమీపిస్తున్నా ప్రభుత్వం ధాన్యం తరలింపులో తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనీ, ధాన్యం తూకం వేయడంలో తీవ్ర జాప్యంతో రైతులు చలిలోనే తమ ధాన్యం వద్ద కాపలా కాయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రైస్ మిల్లర్లు తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా సుమారు రెండు గంటల పాటు చేపట్టడంతో కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి.
పోలీసులు అక్కడికి వచ్చి అఖిలపక్ష నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ధర్నాను విరమించలేదు. డిప్యూటీ తహసీల్దార్ స్వామి, వ్యవసాయాధికారి సంతోష్ అక్కడికి చేరుకుని నచ్చచెప్పడంతో రాస్తారోకోను విరమించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ జమున రాథోడ్, ఎల్లారెడ్డి సింగిల్‌విండో వైస్ చైర్మెన్ ప్రశాంత్‌గౌడ్, భిక్కనూర్ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ బత్తిని దేవేందర్, నాయకులు జనార్ధన్‌రెడ్డి, ఎంపీటీసీ శ్రీధర్, మాజీ జెడ్పీటీసీ సామెల్, తదితరులు పాల్గొన్నారు.