Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒమిక్రాన్ నిర్ధారణ కాలేదు..
- ముప్పు పొంచి ఉంది.. వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలి
- ఇక కఠినంగా కోవిడ్ నిబంధనల అమలు
- టీకా తప్పనిసరి ప్రతిపాదనలు : డీహెచ్ డాక్టర్ జి.శ్రీనివాసరావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ కాలేదని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అయితే దాని ముప్పు పొంచి ఉందనీ, ప్రజలు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇకపై పార్కులు తదితర బహిరంగ ప్రదేశాల్లో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తనిఖీ కార్యక్రమాన్ని ఆరోగ్య బృందాలు నిర్వహిస్తాయనీ, ప్రజల్లో అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమమని స్పష్టం చేశారు. ప్రజలు తమ వ్యాక్సిన్ వేసుకున్న సర్టిఫికే ట్ను హార్డ్ కాపీ రూపంలో గానీ, ఫోన్లో గాని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మాస్కు ధరించకుంటే రూ.1000 జరిమానా ఆదేశాలను కచ్చితంగా అమలవుతాయని హెచ్చరించారు. త్వరలో కొత్త మార్గదర్శకాలు విడుదల కానున్నాయని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రిటీష్ ఎయిర్ వేస్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న 35 ఏండ్ల మహిళకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. అయితే ఆమెలో డెల్టా వేరియంట్ లేదా ఒమ్రికాన్ వేరియంట్లో ఏది ఉందనే విషయం నిర్ధారించుకునేందుకు నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించినట్టు చెప్పారు. ఆమెను టిమ్స్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోనివారు, రెండో డోసు టీకా తీసుకోవాల్సిన వారు కచ్చితంగా వ్యాక్సినేషన్‌కు వెళ్లాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. కొత్త వేరియంట్ ప్రవర్తన మనం పాటించే కొవిడ్ నిబంధనల మీద ఆధారపడి ఉంటుందని వివరించారు. తగిన జాగ్రత్తలు పాటించకపోతే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వస్తున్న జనవరి లేక ఫిబ్రవరిలో మరో ముప్పు రావొచ్చనే అసత్య ప్రచారాలు వాస్తవమవుతాయని శ్రీనివాసరావు హెచ్చరించారు.
డెల్టా కంటే ఒమిక్రాన్‌కు వేగమెక్కువ
డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ ఆరు రెట్లు వేగంగా వ్యాపిస్తున్నదని డీహెచ్ తెలిపారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే అది మూడు దేశాల నుంచి 24 దేశాలకు విస్తరించిందని వెల్లడించారు. టీకాలు వేసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చనీ, వ్యాక్సిన్ తప్పనిసరి చేయా లన్న ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తామని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి గురువారం రాష్ట్రానికి 325 మంది చేరుకోగా వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది.