Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతాంగ సమస్యలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి
- ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టతివ్వాలి : సీపీఐ(ఎం) రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-సూర్యాపేట
విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు పెరిగాయన్న సాకుతో కరెంటు చార్జీలను భారీగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజలపై భారం పడకుండా సర్దుబాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వికాస్ బీఫార్మసీ కళాశాలలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
విద్యుత్ చార్జీల పెంపు ఆలోచన విరమించుకోవాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఉద్యమం ప్రభుత్వాలనే తలకిందులు చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. బీజేపీ విధానాలను వ్యతిరేకించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం తగదన్నారు. అప్పుడప్పుడు బీజేపీ విధానాలను వ్యతిరేకించడం, తర్వాత మెతక ధోరణి ప్రదర్శించడం సీఎం కేసీఆర్కు పరిపాటిగా మారిందన్నారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతోందని, దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. యాసంగి వరి విషయంలో కేంద్ర ప్రభుత్వం రైతులతో ఆటలాడటం సరికాదన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో పార్లమెంట్ సమావేశాల్లో స్పష్టమైన ప్రకటన చేయాల న్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో తాడోపేడో తేల్చుకుంటామని ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ ఉత్త చేతులతో వచ్చారన్నారు. గతంలో ప్రకటించినట్టు ఢిల్లీలో ధర్నా, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లే విషయాలపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రైతాంగ సమస్యలపై వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు తదితరులు పాల్గొన్నారు.