Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రయివేటీకరణ అనేది అభివృద్ధిని దెబ్బతీస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ బ్యాంకుల ప్రయివేటీకరణను వ్యతరేకిస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించింది. ఏఐబీఈఏ ఉప ప్రధాన కార్యదర్శి పీవీ కృష్ణారావు అధ్యక్షత వహించగా చాడ వెంకట్ రెడ్డి తోపాటు ఏఐబీఈఏ జాతీయ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.డి. చంద్రశేఖర్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్.బోస్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వీ నాగేశ్వర్రావు, ఈసీఐఎల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జీవీఆర్. ప్రసాద్, ఎన్ఏండీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వివి.దుర్గారావు, ఐఎన్‌బీఓసీ ప్రాంతీయ కార్యదర్శి సతీష్‌తోపాటు వివిధ బ్యాంకు ఉద్యోగులు ధర్నాకు హాజరయ్యారు. ఈ సందర్బంగా ''బ్యాంక్ బచావో - దేశ్ బచావో'', ''మోడీ కో హటావ్ - దేశ్ కో బచావ్'' ప్రయివేటీకరణ నుంచి బ్యాంకులను రక్షించండి, ప్రభుత్వరంగ బ్యాంకులను కాపాడండి అని కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున నినాదాలు చేసారు. ఈ సందర్బంగా చాడ మాట్లాడుతూ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా, దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణను ప్రతిఒక్కరూ వ్యతరేకించాలని పిలుపునిచ్చారు.దేశ ఆర్థికాభివద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రయివేటీకరణ ప్రతిపాదనను విరమించుకోవాలని, ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఈ నెల 16 , 17 తారీఖుల్లో దేశవ్యాప్త సమ్మె చేయబోతున్నామని హెచ్చరించారు. దేశంలోని దాదాపు 10 లక్షలమంది బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. భవిషత్తులో ప్రభుత్వరంగ ప్రెయివేటీకరణ ప్రయత్నాలను తిప్పికొడుతూ బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రైతు ఉద్యమం తరహా పోరాటాలు, సుదీర్ఘ సమ్మెలకు దిగుతామని రాంబాబు హెచ్చరించారు.