Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14న చలో హైదరాబాద్ : టీయూఎమ్హెచ్ఈయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వైద్యారోగ్య శాఖ పరిధిలోని వైద్య విధాన పరిషత్, వైద్య విద్య పరిధిలోని జనరల్ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, జిల్లా, ఏరియాస్పత్రులు, ఇతర వైద్య సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపాల్, కె.యాదానాయక్ డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో ఈ నెల 14న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఆ యూనియన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రెండేండ్లుగా ప్రాణాలొడ్డి పనిచేస్తున్న పేషెంట్ కేర్, శానిటేషన్, స్వీపింగ్, సెక్యూరిటీ, తదితర విభాగాల్లో పనిచేస్తున్న నాలుగో తరగతి సిబ్బందికి వేతనాలు గానీ, ఇన్సెంటివ్‌లు గానీ పెంచడం లేదని తెలిపారు. కాలపరిమితి ముగిసినా కాంట్రాక్టు సంస్థల గుత్తాధిపత్యం కొనసాగుతున్నదన్నారు. కనీస వేతనాల జీవో 68 గానీ, 11 గానీ అమలు చేయటం లేదని విమర్శించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 60ని కూడా తొక్కిపెడుతున్నాయని తెలిపారు. 20 ఏండ్ల నుంచి పనిచేస్తున్నవారికి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల రూపాయలకు మించి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోగుల దగ్గరుండి సేవలందిస్తున్న వారికి కనీస సౌకర్యాలు లేవని వాపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని నిర్ణయించామనీ, అందులో భాగంగానే 14వ తేదీన ఛలో హైదరాబాద్ తలపెట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వాస్పత్రుల్లోని కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కుమారస్వామి, వాణి, లక్ష్మి, రమ, మీనా, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.