Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలి:రజత్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్‌కు సత్వరమే ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని సాగునీటిపారుదల,ఆయకట్టు శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఈమేరకు చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులతో ఆయన సమీక్ష చేశారు. డీపీఆర్‌ల ఆమోదం కోసం అనుసరించాల్సిన వ్యూహాంపై అధికారులతో చర్చించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు డీపీఆర్‌లను సాగునీటిపారుదల శాఖ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రాజెక్టు వరదజలాలపై ఆధారపడిన నేపథ్యంలో కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ), కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం విషయంలో సత్వరం నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు సమాచారం. ఈ తరుణంలో కృష్ణానదీ యాజమాన్యబోర్డు(కేఆర్ఎంబీ)కి కూడా పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్‌లను అందజేయాలని కేంద్ర జలశక్తి శాఖ ఇటీవల రేఖాచిత్రాన్ని(ఫ్లోచార్ట్) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఎలా ముందుకెళ్లాలనే విషయమై రజత్‌కుమార్ సాగునీటిపారుదల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటి అయ్యారు. కాగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కృష్ణాబేసిన్‌లోని ఆయకట్టు అవసరాల కోసమే డిజైన్ చేసినందున వరద జలాలకు బదులు నదీ జలాల్లో నికర కేటాయింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది. ఇందుకోసమే ప్రత్యేకంగా మరో ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆవిర్భావం నుంచి కోరుతున్నది. అది జరిగితేనే కృష్ణాబేసిన్‌లోని ఆయా ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు సాధ్యమవుతాయనీ, తద్వారా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కూడా పూర్తిసాధికారత చేకూరుతుందని రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ భావిస్తున్నది. మరోవైపు ఇటీవల జరిగిన దక్షిణాధి రాష్ట్రాల కౌన్సిల్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను సమర్పించాలని కోరినట్టు సమాచారం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది.