Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొమ్మిదిన హైదరాబాద్ లో ధర్మాగ్రహ దీక్ష
- తెలంగాణలో అఖిలపక్ష సమావేశం తీర్మానం
నవతెలంగామ బ్యూరో - హైదరాబాద్
ధాన్యం కొనుగోలు చేయాలనే ప్రధాన డిమాండ్ తో ఈ నెల ఏడున కొనుగోలు కేంద్రాల సమీపంలో రాస్తారోకోలు, దీక్షలు చేపట్టాలని అఖిలపక్ష పార్టీల సమావేశం నిర్ణయించింది. తొమ్మిదిన హైదరాబాద్లో రైతుల ధర్మాగ్రహ దీక్షలు చేపట్టాలని తీర్మానించింది. హైదరాబాద్లో గురువారం జరిగిన ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టేజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాంతో ఆయా పార్టీల నాయకులు పోటు రంగారావు (న్యూడెమోక్రసీ), సాధినేని వెంకటేశ్వర్ రావు (న్యూడెమోక్రసీ), శ్రీపతి సతీష్ (తెలుగుదేశం పార్టీ), సందీప్ చమార (ఇంటి పార్టీ) పాల్గొన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు మాటల యుద్ధంతో రైతులకు నష్టం చేస్తున్నాయని ఈ సందర్భంగా వారు విమర్శించారు. ఇరు పార్టీల మధ్య తలెత్తిన రాజాకీయ పోరులో రైతులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వైపు రాష్ట్రంలో ఖరీఫ్ వడ్ల కొనుగోలు ఇంకా పూర్తి కాలేదు. మరొక వైపు యాసంగి వడ్లను కొనబోమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చి చెప్పాయి. రైతుల సమస్యలు పక్కకుపోయి... పార్టీల రాజకీయ ప్రయోజనాలు ప్రధానమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో రైతు సంక్షేమం కోసం నిలబడి, సంఘటితంగా పోరాటం చేయవలసిన అవసరం ఉన్నదని సమావేశం నిర్ణయించింది.తెలంగాణ వ్యవసాయాన్నీ, రైతును బతికించుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్లను నెరవేర్చాలని తీర్మానించింది. వానాకాలం వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలి. కేంద్రం బేషరతుగా, గతంలో మాదిరిగా బియ్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసింది. కేసీఆర్ మాటల యుద్ధం మాని రైతును ఆదుకోనే లక్ష్యంతో బియ్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. తరుగు పేరుతో జరుగుతున్న దోపిడిని నిలువరించాలి. కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలి. ఒ.టి.పి పద్దతిని తొలగించి పాత పద్దతినే ధాన్యం కొనాలి.కొనుగోలు కేంద్రాలలో కనీస సౌకర్యాలను కల్పిం చాలి. వేసంగి వడ్లను కూడా కొనుగోలు చేయాలి. అన్నీ పంటలకు మద్దతు ధర ప్రకటించి, కొనుగోలు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని కోరింది.