Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక సంఘాలతో సింగరేణి యాజమాన్యం చర్చలు
- సింగరేణి యాజమాన్యం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బొగ్గు బ్లాకుల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 9 నుంచి మూడు రోజుల పాటు కార్మిక సంఘాలు చేపట్టనున్న సమ్మెను విరమించుకోవాలని సింగరేణి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమనీ, సమ్మె ఆలోచన విరమించి, ప్రత్యామ్నాయ పద్ధతుల్లో బొగ్గు గనుల్ని కాపాడుకొనే చర్యలకు ప్రయత్నించాలని కార్మిక సంఘాలకు సూచించింది. ఈ మేరకు శుక్రవారం సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘాల ప్రతినిధులతో సుదీర్ఘ చర్చలు జరిపింది. కార్మిక సంఘాల నాయకులు వెంకట్రావ్, మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం), రాజిరెడ్డి, బి మధు (సీఐటీయూ), వాసిరెడ్డి సీతారామయ్య (ఏఐటీయూసీ), జనక్ ప్రసాద్, ఎస్ నర్సింహారెడ్డి (ఐఎన్టీయూసీ), రియాజ్ అహ్మద్, జక్కుల నారాయణ (హెచ్ఎంఎస్), యాదగిరి సత్తయ్య, మాధవ నాయక్ (బీఎంఎస్) తదితరులు ఈ చర్చలకు హాజరయ్యారు. సింగరేణి యాజమాన్యం తరఫున డైరెక్టర్లు ఎస్ చంద్రశేఖర్ (ఆపరేషన్స్), ఎన్ బలరామ్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్, ఫైనాన్స్, పర్సనల్), డీ సత్యనారాయణరావు (ఈ అండ్ ఎం), జనరల్ మేనేజర్లు కె సూర్యనారాయణ, ఏ ఆనందరావు, కే నాగభూషణ్‌రెడ్డి, పీ సత్తయ్య, ఏజీఎం(ఐఆర్) హన్మంతరావు, డీవైపీఎం ఎల్ తిరుపతి చర్చల్లో పాల్గొన్నారు. బొగ్గు బ్లాకుల ప్రయివేటీకరణ చేయొద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కేంద్రప్రభుత్వానికి లేఖ రాసారని అధికారులు తెలిపారు. సమ్మె వల్ల ఏమీ సాధించలేమనీ, ఆర్థికంగా సంస్థతో పాటు ఉద్యోగులందరికీ నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. సింగరేణి పరిధిలోని నాలుగు బొగ్గు బ్లాక్‌లు వేలానికి వెళ్లకుండా చూసేందుకు యాజమాన్యం శక్తివంచన లేకుండా చివరి వరకూ అనేక ప్రయత్నాలు చేసిందని చెప్పుకొచ్చారు. సంస్థ తరఫున కేంద్రానికి లేఖ రాస్తూ, ఆ బ్లాకుల్లో తాము చేపట్టిన అన్వేషణ పనులను కూడా వివరించామని తెలిపారు. బొగ్గు బ్లాక్‌ల వేలం కేంద్ర ప్రభుత్వ దేశవ్యాప్త విధానపర నిర్ణయమనీ, ఈ నేపథ్యంలోనే తెలంగాణలో నాలుగు బొగ్గు బ్లాక్ లను వేలం వేస్తున్నారని చెప్పారు. ఈ సమస్య సింగరేణికీ, తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సంబంధించింది కాదనీ, ఇక్కడ సమ్మె చేయడం సమస్య పరిష్కారానికి ఉపయోగకరం కాదని సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘలకు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఉత్పత్తికి విఘాతం లేకుండా వేరే పద్ధతుల్లో సమస్యను పరిష్కరించుకోవచ్చని వారు ప్రతిపాదించారు.
సమ్మె తప్పదు: సింగరేణి కార్మిక సంఘాలు
బొగ్గు గనుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 9 నుంచి కార్మికుల సమ్మె యథాతధంగా జరుగుతుందని కార్మిక సంఘాలు యాజమాన్యానికి తేల్చిచెప్పాయి. రాష్ట్రంలోని నాలుగు బ్లాక్‌ల వేలంతో సింగరేణి మనుగడకే ప్రమాదమని టీజీబీకేఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ, హెచ్ఎమ్ఎస్, బీఎమ్ఎస్, ఐఎన్టీయూసీ నాయకుల స్పష్టంచేశారు. రానున్న రోజుల్లో తెలంగాణలో ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయనీ, కార్మిక కుటుంబాలు రోడ్డున పడతాయిని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనలతో కేంద్రం రైతు చట్టాలనే ఉపసంహరించుకున్నదనీ, తమ పోరాటంతో బొగ్గుబ్లాక్‌లను తిరిగి కాపాడుకుంటామని తేల్చిచెప్పారు. యాజమాన్యంతో చర్చల అనంతరం కార్మికసంఘాల నేతలు భేటీ అయ్యారు. సమ్మె సమయంలో పార్లమెంటు సభ్యులందరికీ లేఖలు రాయాలనీ, ముఖ్యమంత్రిని కలిసి ప్రత్యేకంగా వినతిపత్రం ఇవ్వాలనీ, బొగ్గు బ్లాకుల్ని వేలంలో దక్కించుకున్న ప్రయివేటు కంపెనీల కార్యకలాపాలను అడ్డుకోవాని నిర్ణయించారు. ఈ మేరకు కార్యాచరణను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. సమ్మెకు యాజమాన్యం సంఘీభావం తెలపాలని కోరారు.