Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అవమానించడమే
- మోడీని కేసీఆర్ ఎందుకు విమర్శించడం లేదు
- వడ్ల కొనుగోలుపై బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ డ్రామా
- రైతులను గాలికొదిలేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం
- వరి పండే భూముల్లో ఆ పంటే వేసేలా అనుమతివ్వాలి: నవతెలంగాణతో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వడ్ల కొనుగోలుపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ డ్రామా నడుస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే కేంద్రంపై యుద్ధం చేస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు. కానీ మూడు రోజులు అక్కడే ఉండి ఏం తేల్చలేదని అన్నారు. ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కేసీఆర్ అడిగారా? లేదా? అనే దానిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ధాన్యం కొనుగోలు చేసేది లేదంటూ కేంద్రం చెప్పినా ప్రధాని మోడీని ఎందుకు విమర్శించడం లేదన్నారు. అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే కేంద్రంపై రాజకీయ యుద్ధం ఎందుకు చేయడం లేదని అడిగారు. రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని అన్నారు. వరి మాత్రమే పండే భూముల్లో ఆ పంట వేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలనీ, ఆ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ముందే ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలపై లెఫ్ట్, టీజేఎస్, టీడీపీ, ఇంటిపార్టీ ఆధ్వర్యంలో ఈనెల 7న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, 9న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపడతామని అన్నారు. వరిధాన్యం కొనుగోలు అంశం జఠిలంగా మారిన నేపథ్యంలో నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు తమ్మినేని వీరభద్రం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితి ఏంటి? రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి?
ధాన్యం కొనుగోళ్ల విషయంలో పరిస్థితి తీవ్రంగా ఉన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతులంతా ఆందోళనలో ఉన్నారు. అందుకే రైతాంగ సమస్యలపై లెఫ్ట్, టీజేఎస్, టీడీపీ, ఇంటిపార్టీ ఆధ్వర్యంలో ఈనెల 7న అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించాం. 9న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపడతాం. ఈ ధర్నాలో బీజేపీ, టీఆర్ఎస్ మాటల యుద్ధం మానుకుని సమస్య పరిష్కారం కోసం ఎంత ధాన్యం కొంటుందో కేంద్రం చెప్పాలి. కేంద్రం కొన్నా కొనకపోయినా కొనుగోళ్లు, అమ్మకాల వల్ల రూ.7 వేల కోట్లు నష్టపోయినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. ఆ నిధులను కేంద్రం కేటాయించాలి. వరి తప్ప వేరే పంటలు పండని భూములున్నాయి. ఆ భూముల్లోనైనా వరి పండించేందుకు అనుమతి ఇవ్వాలి. మొత్తం కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాదు. పరిమితంగా వరి ధాన్యం కొనుగోలు చేస్తామని కేసీఆర్ ప్రకటించాలి. అదీ చెప్పడం లేదు. కొంటామన్న వానాకాలం పంటనూ పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడం లేదు. కొంటే వరి ధాన్యానికి మొలకలు ఎందుకొస్తాయి. కొనుగోలు కేంద్రాలు ఎక్కువ లేవు. బ్యాగులు సైతం లేవు. ఆయా కేంద్రాల వద్ద అధికారుల్లేరు. ఎక్కడికక్కడ రైతులు ధర్నా చేస్తే అధికారులు వచ్చి కొంటామని చెప్తున్నారు. ముందే ఎందుకు కొనుగోలు చేయలేదు. పైకి ఏం చెప్పినా రైతులను గాలికొదిలేసిన బాధ్యతారాహిత్యం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది.
బీజేపీ, టీఆర్ఎస్ల వైఖరిని రైతులు ఎలా అర్థం చేసుకోవాలి?
ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఎలా ఆదుకోవాలనే విషయం కంటే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయ డ్రామా ఎక్కువ నడుస్తున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయెద్దని నిర్ణయించింది. అది నిజం. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మేరకు లేఖ రాసింది. అది కొన్ని నెలల ముందే వచ్చినా సరే హుజురాబాద్ ఎన్నికల్లో ఓడిపోయి బండి సంజరు ధాన్యం కొనుగోలు విషయాన్ని లేవనెత్తేదాకా ఆ లేఖను కేసీఆర్ బయటపెట్టలేదు. కాబట్టి ఆ లేఖను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడు ఆమోదమే. నిజంగా కేంద్రం తప్పుచేసిందని భావిస్తే అప్పుడే ఆ లేఖను బయటపెట్టాల్సింది. ఇప్పుడు ఏవైతే విమర్శలు చేస్తున్నారో అప్పుడే చేస్తే బాగుండేది. ఇప్పుడైనా కేంద్రంపై సీరియస్‌గా యుద్ధం చేస్తున్నారా? అంటే అదీ చేయడం లేదు.
ధాన్యం విదేశాలకు ఎగుమతి చేసే అవకాశముందంటారా?
మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఉంది. కానీ మోడీ కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారీ దేశాల మాట వింటున్నారు. అవి ఏం చెప్తున్నాయంటే ఆయా దేశాల్లో వరి, గోధుమలు ఎక్కువగా పండుతాయి. వాటిని మనదేశంలోకి దిగుమతి చేసుకోవాలంటే ఇక్కడ వరి, గోధుమలు తక్కువ పండించాలి. వరి పంటను నిర్వీర్యం చేస్తే విదేశాల నుంచి భారత్‌కు దిగుమతి చేసుకోవచ్చని కార్పొరేట్‌శక్తులు ఆలోచిస్తున్నాయి. మోడీ దానికి తలొగ్గుతున్నారు. అమెరికా మాట వినడంలో భాగమే ఇది. రైతుల పట్ల ఎంతో ప్రేమ ఒలకబోసే మోడీ ధాన్యం కొనుగోలుకు ఖర్చయ్యేదెంత రూ.7 లక్షల కోట్లు కేటాయిస్తే దేశంలోని 23 రకాల పంటలనూ మద్దతు ధరలతో కొనొచ్చని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోనే రైతుబంధుకు ఏడాదికి రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. దేశంలో రూ.7 లక్షల కోట్లు ఖర్చు పెట్టి 23 రకాల పంటలను కొనేందుకు ఇబ్బంది ఏంటి?. కానీ రూ.20 లక్షల కోట్లు ఖర్చవుతుందని మోడీ ప్రభుత్వం చెప్పడం తప్పు. రైతులు పండించిన పంట మొత్తాన్ని లెక్కించి చెప్తున్నారు. మొత్తం పంట మార్కెట్‌కు రాదు.
యాసంగిలో వరి సాగు చేయొద్దంటూ కేసీఆర్ చెప్తున్నారు. ఇంకోవైపు పంటల మార్పిడి చేసుకోవాల్సిందేనని అంటున్నారు. ఏ భరోసాతో రైతులు అటువైపు వెళ్లాలి?.
పంటల మార్పిడి చేయడం మంచి పద్ధతే. కానీ ఈ నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి పంటల మార్పిడి చేయాలని చెప్పడం అసంబద్ధమైన విషయం. భూమికి ఒకే రకమైన పంటల కంటే వేర్వేరు పంటలు వేస్తే భూసారం పెరుగుతుందని సైన్స్ చెప్తుంది. పంటల మార్పిడికి అవకాశముంటే చేయొచ్చు. కానీ రాష్ట్రంలో బాడువా భూముల్లో వరి మాత్రమే సాగవుతుంది. ఆ భూముల్లో నీళ్లుంటాయి. వేరే పంట పత్తి, మిర్చి, మొక్కజొన్న వేయడానికి సాధ్యం కాదు. కాల్వలు, ప్రాజెక్టుల ద్వారా నీళ్లు వచ్చే భూముల్లో పంటల మార్పిడికి అవకాశముంది. కానీ అవకాశం లేకుండా వరి మాత్రమే పండే భూముల్లో అది వేయొద్దంటే పడావు పెట్టాలి. ఈ క్రమంలో ప్రాజెక్టులు కట్టి నీళ్లిచ్చాం అని ప్రభుత్వం చెప్పడంలో అర్థం లేదు. అందుకే భూములను పడావు పెట్టొద్దు. వరి మాత్రమే పండే భూముల్లో ఆ పంట వేయాలని ప్రభుత్వం చెప్పాలి. ఆ మేరకు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వాలి.
ధాన్యం కొనుగోళ్లపై సీపీఐ(ఎం) ఆందోళనల్లో వెనుకబడిందన్న అభిప్రాయం వినిపిస్తున్నది. దీనిపై ఏమంటారు?
అలా ఏం లేదు. అందరికంటే ముందు నిర్ణయం తీసుకున్నది సీపీఐ(ఎం). కేసీఆర్ ఢిల్లీ యాత్ర కంటే ముందుగానే గతనెల 4న అన్ని గ్రామాలనూ సందర్శించాం. 6న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ఆ తర్వాత పార్టీ జిల్లా మహాసభల్లో తీర్మానం చేసి రైతాంగ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. మీడియాలో ప్రచారం చేస్తున్నాం. అది కాకుండా స్థానికంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. నల్లగొండలో పార్టీ ఆధ్వర్యంలో అనేక ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. రాష్ట్రవ్యాప్త పిలుపులు రెండు, మూడు సందర్భాల్లో ఇచ్చాం. ఇప్పుడు లెఫ్ట్, టీజేఎస్, టీడీపీ, ఇంటిపార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టాలని పిలుపునిస్తున్నాం.