Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీకా వేయకుండానే సక్సెస్ మెసేజ్‌లు
- ఆరోగ్య శాఖలో వింత ధోరణి
- ఆగస్టులో చనిపోతే నవంబర్‌లో సక్సెస్ మెసేజ్
- తప్పును కప్పి పుచ్చుకునే యత్నంలో అధికారులు
నవతెలంగాణ - మహబూబ్‌నగర్
ప్రాంతీయప్రతినిధి / కల్వకుర్తి
''నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో రోహిత్ అనే యువకుడు ఆగస్టులో మరణించాడు. అయితే ఆ యువకుడికి నవంబర్ 30న రెండో డోస్ వేసినట్టు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. మృతుడి తల్లి రమాదేవి రెండో డోసు వేసుకోలేదు. అయినా వేసుకున్నట్టు సమాచారం వచ్చింది. ఆ యువకుడి చెల్లెలు, తండ్రికి కూడా రెండో డోసు వేసుకున్నట్టు సమాచారం వచ్చింది..'' ఇదీ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశాఖలో లక్ష్యం పేరుతో సాగుతున్న తంతు.
దడ పుట్టించే కరోనా నుంచి తేరుకోకముందే ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ ప్రజలను మరింత భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఈ తరుణంలో అందరికి వ్యాక్సిన్‌తో పాటు అవగాహన కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆరోగ్య శాఖ అధికారులు వంద శాతం వ్యాక్సిన్ వేశామనే లక్ష్యాల కోసం వ్యాక్సిన్ వేయకుండానే ప్రజలకు సక్సెస్ మెసేజ్‌లు పంపుతున్నారు. చాలా మందికి రెండో డోసు వ్యాక్సిన్ వేయకుండా వేసినట్టు మెసేజ్‌లు పంపి.. లక్ష్యం చేరుకున్నానడం విడ్డూరంగా ఉందని జనం విమర్శిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 60 శాతం వ్యాక్సినేషన్ పూర్తైనట్టు సమాచారం. ఉమ్మడి జిల్లాలో 45 లక్షల మంది జనాభా ఉంది. అందులో అధికారిక లెక్కల ప్రకారం నేటి వరకు 28 లక్షల మందికి మొదటి డోసు వేశారు. 18 లక్షల మందికి రెండో డోసు వేశారు. నారాయణపేట జిల్లాలో 3,68,631 మందికి మొదటి డోసు వేయగా, 1,10,293 మందికి రెండో డోసు వేశారు. ఈ లెక్కన 45 శాతం మాత్రమే వ్యాక్సిన్ వేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రెండో డోసు వేసుకోలేదు. అందులో ఒకరు ఆగస్టు నెలలోనే మరణించారు. అయినా నవంబర్‌లో అందరికీ రెండో డోసు వేసినట్టు మెసేజ్ రావడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రిలో కొంత కాలంగా ఈ తతంగం కొనసాగుతోంది. ఇదే పరిస్థితి వనపర్తి జిల్లాలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఖిల్లా ఘణపూర్ మండల కేంద్రానికి చెందిన ప్రవీణ్ కుమార్‌కు కూడా వ్యాక్సిన్ వేసుకోకున్నా వేసుకున్నట్టు సమాచారం పంపారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ అంశంపై సమగ్ర విచారణ చేసి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
సాంకేతిక కారణాలే..
బాబర్- వైద్యాధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం- రఘుపతిపేట
వ్యాక్సిన్ డోస్ వేసుకున్నట్టు ఫోన్‌కు సమాచారం రావడం అరుదుగా జరుగుతుంది. ఒకరి ఫోన్ నెంబర్ ఇతరులు తీసుకున్న క్రమంలో సాంకేతిక సమస్యల కారణంగా ఇలా మెసేజ్‌లు వచ్చే అవకాశం ఉంది. మెసేజ్‌ల విషయంలో ఒకటికి పదిసార్లు పరిశీలించి సందేశాలు పంపుతున్నాం.
మరణించిన వ్యక్తి పేరున మెసేజ్ ఎలా ఇస్తారు?
నా కుమారుడు రోహిత్ ఆగస్టులో చనిపోయాడు. నాలుగు నెలల తరువాత రెండో డోస్ వ్యాక్సిన్ వేసినట్టు సమాచారం పంపారు. సమాచారం చూస్తుంటే ఏమనాలో తెలియడం లేదు. అలాగే, నాతో పాటు భార్యకు, కూతురుకూ మెసేజ్‌లు వచ్చాయి. ఈ విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకోవాలి.
- శ్రీనివాసులు, కల్వకుర్తి