Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాది కూతురి హత్య
- ఆపై తానూ పురుగుల మందు తాగి...
- కుటుంబ కలహాలతో ఘాతకం
- సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో ఘటన
నవతెలంగాణ-తొగుట
కుటుంబ కలహాలతో విచక్షణ కోల్పోయిన ఓ కన్న తండ్రి.. ఏడాది కూడా నిండని తన కూతురికి కరెంట్ షాక్ ఇచ్చి హతమార్చాడు. ఆపై తానూ పురుగుల మందు తాగి ఆత్మాహత్యాయత్నం చేశాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ మొద్దుమల్లేశం, సత్తవ్వల కూతురు సునీతను.. తొగుట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన రాజశేఖర్‌కి 2020 ఫిబ్రవరిలో వివాహం జరిపించారు. ఏడాది పాటు వారి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. గతేడాది డిసెంబర్లో వాళ్లకు ఆడపిల్ల (ప్రిన్సి) జన్మించింది. అప్పటినుంచి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. అత్తమామలు, భర్తతో సునీతకు నిత్యం గొడవలు జరిగేవి. పెద్ద మనుషులు సర్దిచెప్పినా వారి కుటుంబ సభ్యుల్లో ఎలాంటి మార్పు రాలేదు. రోజురోజుకూ కుటుంబ కలహాలు పెరగసాగాయి. ఈ నేపథ్యంలో వారిద్దరిని వేరు కాపురం పెట్టాలని పెద్ద మనుషులు సూచించారు. సుముఖత వ్యక్తం చేసిన రాజశేఖర్.. అదే గ్రామంలో ఇంటిని సైతం రెంటుకు మాట్లాడుతున్నట్టు నిన్నటి వరకు సునీతను నమ్మించాడు. కాగా, వేరుగా ఉండేందుకు వీలు కాదనీ, తల్లిదండ్రులతోనే కలిసి ఉందామంటూ చెప్పడంతో.. తనకు ఇష్టం లేదనీ, ఇలాగైతే ఉండలేనని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోతానని సునీత చెప్పింది. దాంతో రాజశేఖర్ ఆగ్రహంతో భార్యను కొట్టి.. కూతుర్ని తీసుకొని వ్యవసాయ బావి వద్దకు వెళ్ళాడు. అక్కడ చిన్నారికి కరెంట్ షాక్ పెట్టి హత్య చేశాడు. అనంతరం తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు.. అతన్ని చికిత్స కోసం గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఆర్వీఎం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. చిన్నారి తల్లి సునీత ఫిర్యాదు మేరకు రాజశేఖర్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.