Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కామారెడ్డి జిల్లా పిట్ల మండలం రైతుల్లో నిరాశ
నవతెలంగాణ-పిట్లం
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచిస్తున్న అధికారులు అందుకు తగ్గ విత్తనాలు సరఫరా చేయనప్పుడు, పంటను కొనుగోలు చేయనప్పుడు ఇంకా అవగాహన సదస్సులు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని రైతులు నిలదీశారు. సదస్సు మధ్యలో నుంచే వెనుదిరిగారు. కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై మండల వ్యవసాయాధికారి కిషన్ శనివారం అవగాహన కల్పించారు. వరికి బదులు శనగ, పొద్దుతిరుగుడు, వేరుశనగ, మినుములు, ఆవాలు, కూరగాయల పంటలను సాగుచేయలని సూచించారు. స్పందించిన రైతులు.. ఆ పంటల విత్తనాలు మార్కెట్లో దొరకడం లేదనీ, ప్రభుత్వమే పంపిణీ చేసి చేతికొచ్చిన తర్వాత కొనుగోలు చేయాలని కోరారు. విత్తనాలు ఎక్కడైనా కొనుగోలు చేసి ప్రయివేటు వ్యాపారులకే విక్రయించుకోవాల ని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్తనాలు ఇవ్వకుండా,పంట కొనుగోళ్లూ చేపట్టకుండా రైతు సదస్సులు ఎందుకంటూ ప్రశ్నించారు.సదస్సులతో లాభం లేదని సమావేశం మధ్యలో నుంచే రైతులు వెనుదిరిగారు.కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ సాయిరెడ్డి, పిట్లం టౌన్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు శ్రీకర్ రెడ్డి, పండిరి వ్యవసాయ విస్తీర్ణాధికారులు వీణ, ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు.