Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూసుమంచి
రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీస్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్న కూసుమంచి పోలీస్ స్టేషన్లో మాత్రం ఇందుకు భిన్నంగా స్టేషన్ ఏఎస్ఐ సుధాకర్ వ్యవహార శైలి ఉన్నది. శనివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామంలో వ్యవసాయ భూమి విషయంలో కోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయంపై ఏఎస్ఐ సుధాకర్ అన్నం తింటున్న రైతులను బలవంతంగా శనివారం మధ్యాహ్నం పోలీస్‌స్టేషన్‌కు లాక్కొచ్చి నిర్బంధించారు. ఈ భూమిపై కోర్టులో కేసు నడుస్తున్నా ఏఎస్ఐ రైతులకు ఫోన్ చేసి రమ్మని బెదిరిస్తున్నారనీ, స్టేషన్‌కు రాకపోతే మీ సంగతి చూస్తానంటూ బెదిరిస్తున్నారని రైతులు వాపోయారు. అలానే రైతులకు ఆపోజిట్‌గా ఉన్న దళారీ మాత్రం పోలీస్‌స్టేషన్‌కి రాకుండానే పోలీసులతో పని చేయించుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై రైతులు నవతెలంగాణ రిపోర్టర్‌కు సమాచారం ఇవ్వగా స్టేషన్‌కు వెళ్లాడు. ఏఎస్ఐ సుధాకర్‌ను 'సార్ రైతులు అన్నం తిని రాలేదు. కూసుమంచిలో అన్నం తిన్న తర్వాత తీసుకొని వస్తాను' అని చెప్పగానే.. రిపోర్టర్‌పై దురుసుగా ప్రవర్తించాడు. 'విలేకరులు అయితే బయట రాసుకోవాలి.. నువ్వు ఎవరివి స్టేషన్లోకి రావడానికి.. బయటకు పో.. విలేకరులంటే.. ఉచ్చ పోసుకోవాలా.. నీపై సీపీకి కంప్లైంట్ చేస్తా, పోలీస్ కేసు పెడతా..?' అంటూ బెదిరించి అవమానించారు. 'నీ సంగతి చూస్తా.. మీ విలేకర్ల సంగతి అంతా తెలుసు..' అంటూ అవమానపరిచే విధంగా పరుష పదజాలంతో దూషించారు. ఈ విషయమై పలు విలేకరుల సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి.