Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యారోగ్యశాఖలో ఐదు నెలలుగా పెండింగ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా మహమ్మారి కాలంలో రోగులను రక్షించటంలో వారంతా కీలక పాత్ర పోషించారు. ప్రాణాలను అడ్డుపెట్టి ప్రజలను కాపాడారు. కోవిడ్-19 సేవల కోసం గతేడాది మార్చిలో జాతీయ ఆరోగ్య మిషన్ క్రింద హైదరాబాద్ లో పని చేసేందుకు పారామెడికల్ సిబ్బందిని కాంట్రాక్టు పద్దతిన తీసుకున్నారు. అరకొర జీతాలతో చేరిన వీరు కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్ తదితర ఆరోగ్య కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ఈ ఏడాది జూన్ నెల నుంచి జీతాలను చెల్లించకపోవటంతో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. కరోనా సేవలందించినందుకు గాను వీరిలో అనేక మంది అదే వ్యాధి బారిన పడగా, మరి కొందరి కుటుంబ సభ్యులు కోవిడ్ కు బలయ్యారు. ఇప్పటికే తమ జీతాలను చెల్లించాలని హైదరాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారితో పాటు కలెక్టర్, రాష్ట్ర కుటుంబ సంక్షేమ కమిషనర్ కు వినతిపత్రాలను సమర్పించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవటంతో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావుకు మొరపెట్టుకున్నారు. ఇప్పటికైనా పెండింగ్ లో ఉంచిన తమ జీతాలను చెల్లించాలని మంత్రికి వారు విజ్ఞప్తి చేశారు..