Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వరంగల్ మల్టీ స్పెషాలటీ ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించిన టెండర్లను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అదికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ లో వైద్యారోగ్య, రోడ్లు, భవనాలశాఖ ఉన్నతాధికారులతో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కాలేజీల డిజైన్లను పరిశీలించారు. నిర్మాణంలో నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.మరోసారి సమీక్షించి, పూర్తి స్థాయి నమూనాలు, అంచనాలను రూపొందించాలని ఆదేశించారు. గ్రామీణులకు సంక్లిష్ట చికిత్సలను అందుబాటులోకి తెచ్చేందుకు మెడికల్ కాలేజీలు ఉపయోగపడతాయని తెలిపారు. గచ్చిబౌలి, సతన్నగర్, ఎల్బీనగర్, అల్వాల్లో ఒక్కో ఆస్పత్రిని 1000 పడకలతో అందుబాటులోకి తేనున్నామనీ, వీటికి త్వరలోనే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ పాల్గొన్నారు.కాగా పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో రూ.150 కోట్లతో 200 పడకల ఆస్పత్రిని నిర్మించనున్నట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం హైదరాబాద్లో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.