Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం కొనుగోళ్లు సరిగా లేక రైతుల అవస్థలు
- క్యాంపుల్లో చిందులేస్తున్న 'స్థానిక' ప్రజాప్రతినిధులు
- బాధ్యతారాహిత్యంపై సోషల్ మీడియాలో విమర్శలు
- కొనుగోళ్లపై నేడు వామపక్షాల ధర్నా
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఓవైపు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలు సరిగా లేక రైతులు అత్తెసరు ధరకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. అయినా సరే.. కొనే దిక్కులేక నానా రకాలుగా తిప్పలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ సమర్థవంతంగా కొనసాగేలా చూడాల్సిన ప్రజాప్రతినిధులు ఎంచక్కా గోవాలో మత్తులో తూగుతూ స్టెప్పులు వేస్తున్నారు. రైతులు నెల రోజులకుపైగా బాధలు పడుతుంటే.. ఇవేమీ పట్టించుకోని ప్రజాప్రతినిధుల బాధ్యతారాహిత్యంపై వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. డిసెంబర్ 10వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సొంత ప్రజాప్రతినిధులపై నమ్మకం లేకే టీఆర్ఎస్ గోవా క్యాంప్‌కు తీసుకెళ్లిందని.. 'భలే చాన్స్‌లే..' అంటూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అక్కడ తెగ ఎంజారు చేస్తున్నారని కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఓడలో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఆదివారం ఆడిపాడిన తీరుపై విమర్శలు పతాకస్థాయికి చేరాయి. అధికార, ప్రధాన ప్రతిపక్షం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు క్యాంపులో ఉంటే.. వామపక్షాల ప్రజాప్రతినిధులు మాత్రం ప్రజాక్షేత్రంలో ఉన్నారు. నామమాత్రంగా సాగుతున్న ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, కొనుగోలు కేంద్రాలన్నింటిలో పూర్తిస్థాయిలో కాంటాలు జరపాలని వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిచ్చారు.
పేరుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు
ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్, బీజేపీ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. రెండు నెలల కిందట ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించిన ప్రభుత్వం ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ నేటి వరకు పావు వంతు లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోయింది.
- ఖమ్మం జిల్లాలో 249 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 102 కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు జరుపుతున్నారు. ఇప్పటి వరకు 3,332 మంది రైతుల నుంచి 30,190 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ లెక్కన నిర్దేశిత లక్ష్యం 4,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలంటే ఎన్ని నెలలు పడుతుందో అర్థం చేసుకోవచ్చు.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 155 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సోమవారం 38 కేంద్రాల్లోనే కొనుగోళ్లు జరిపారు. 3,574 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే ఇప్పటి వరకు కొని మిల్లులకు తరలించారు.
గోవాలో చిందులు..
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్థానిక సమస్యలను వదిలేసి గోవా క్యాంప్‌లో ఎంజారు చేస్తున్నారు. తమ పరిధిలో రైతులు ధాన్యం కాంటాలు కాక అవస్థలు పడుతుంటే.. ఇవన్నీ వది లేసి ఆదివారం షిప్లో విహరిస్తూ 'డుగ్గు.. డుగ్గు.. డుగ్గు..'' అంటూ స్టెప్పులేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్కు పూర్తి ఆధిపత్యం ఉన్నా పదిరోజులపాటు గోవా క్యాంప్‌కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ ప్రజాప్రతినిధులైనా పక్కచూపులు చూస్తారనే అపనమ్మకం తోనే క్యాంపుకు తరలించారని పెద్దఎత్తున విమర్శలు వస్తు న్నాయి. ఐదారురోజుల కిందట 12 బస్సుల్లో గోవాకు తరలి వెళ్లారు. అక్కడ మూడు వేర్వేరు ప్రాంతాల్లో వీళ్లను ఉం చారు. మొత్తం 470మంది ఓటర్లు (స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు) ఈ శిబిరంలో ఉన్నారు. కొందరు భర్త, భార్య, పిల్లలు కలిసి వెళ్లారు. ఇలా 700 మందికి పైగా గోవా టూర్ లో ఎంజారు చేస్తున్నారు. అభ్యర్థి తాత మధు సైతం వెళ్లారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్టెప్పులు వేసిన దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మె ల్యేలు, టీఆర్ఎస్ ముఖ్యనేతలు పలువురు అక్కడే తిష్టవే శారు. వారంతా 8వ తేదీ నాటికి హైదరాబాద్ చేరుకుని, 9వ తేదీ అక్కడే ఉండి, 10వ తేదీ ఎన్నికకు హాజరవుతారని సమాచారం. ఇప్పటికే ఒక్కో ఓటర్‌కు రూ.3,00,000 నజరానా ప్రకటించినట్టు సమాచారం. డబ్బుకు డబ్బు, జోష్ కు జోష్ దొరుకుతుండటంతో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎంజారు చేస్తున్నారు. మరోవైపు మామిడిమిల్లి వెళ్లిన కాం గ్రెస్ ప్రజాప్రతినిధులకు ఇంతలా ఎంజారుమెంట్ లేకపో యినా రూ.లక్షవరకు గిట్టుబాటు అవుతుందని సమాచారం.
నాటకాలు కట్టిపెట్టి కొనుగోళ్లు చేయాలి
నున్నా నాగేశ్వరరావు- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
కొనుగోలు కేంద్రాలు పెంచాలి. నెలకొల్పిన అన్ని కేంద్రాల్లోనూ కొనుగోళ్లు చేపట్టాలి. ప్రభుత్వం కొంటామంటూనే నిర్లక్ష్యం చేస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ వరి నాటకం ఆడుతున్నాయి. వానాకాలం పంట కొనకుండా యాసంగి గురించి హడావుడి చేయడంలో ఆంతర్యం రాజకీయ ప్రయోజనమేనని అర్థమవుతోంది. ప్రభుత్వాల వరి నాటకంతో రైతులు గందరగోళంలో ఉన్నారు. కేంద్ర, రాష్ట్రాలు రైతులను ముంచే కార్యక్రమం చేస్తున్నాయి. పూర్తిస్థాయి కొనుగోళ్లు చేపట్టాలని నేడు వామపక్షాల ఆధ్వర్యంలో అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తున్నాం.